
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుత ఆటతీరు, నాయకత్వంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ తెలిపారు. ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ.. టీమిండియా మాజీ సారథి(కెప్టెన్) ఎంఎస్ ధోనితో కోహ్లి అనేక మ్యాచ్‌లు ఆడటం వల్ల వైవిధ్యమైన నైపుణ్యాలను అందిపుచ్చుకున్నాడని అన్నారు. అయితే కోహ్లి, ధోని కెప్టెన్సీలు మాత్రం విభిన్నమని విశ్లేషించారు. కోహ్లి తుది జట్టులో అనేక మార్పులు చేస్తాడని, ధోని మాత్రం మార్పులకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడని వెల్లడించారు. కాగా పిచ్‌లను బట్టి కోహ్లి ఆటగాళ్లను ఎంపిక చేస్తాడని, ఉన్నత ప్రమాణాలు, వైవిధ్యంతో బౌలింగ్ చేసే వారికి అధిక ప్రాధాన్యత ఇస్తాడని తెలిపారు. కాగా నైపుణ్యం కలిగిన బౌలర్లతోనే కోహ్లి అధిక విజయాలు సాధిస్తున్నాడని అభిప్రాయపడ్డారు.
అయితే ప్రపంచ క్రికెట్‌లో మూడు ఐసీసీ టైటిల్స్ నెగ్గిన ఏకైక కెప్టెన్ ధోని అని పేర్కొన్నాడు. ముఖ్యమైన ఐసీసీ టోర్నీలు కోహ్లి సాధించకపోవడంపై ఆయన స్పందిస్తూ.. ఎక్కువ శాతం సెమీఫైనల్ వరకు విజయాలు సాధిస్తున్నాడని, కానీ సెమీఫైనల్‌లో అతనికి దురదృష్టం వెంటాడుతోందని తెలిపారు. కానీ గత కొంత కాలంగా అన్ని ఫార్మాట్‌లలో స్థిరమైన ఆటతీరును టీమిండియా ప్రదర్శిస్తోందని కొనియాడారు. అయితే కొన్ని మ్యాచ్‌లలో వివిధ కారణాల వల్ల ధోని జట్టులో లేకపోవడంతో కోహ్లి అద్భుత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడని అన్నారు. కాగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారని లక్ష్మణ్ శివరామకృష్ణన్ పేర్కొన్నారు. ( చదవండి: సోషల్ మీడియాకు ధోని దూరంగా!)
Comments
Please login to add a commentAdd a comment