
అనన్య జోడీకి టైటిల్
సెయిలింగ్ చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్–గ్రీన్‌కో యూత్ ఓపెన్ రెగెట్టాలో అనన్య చౌహాన్ –అనన్య సివాచ్ జోడీ టైటిల్ కైవసం చేసుకుంది. హుస్సేన్ సాగర్‌లో బుధవారం ముగిసిన ఈ పోటీల్లో హైదరాబాద్ ఈఎమ్‌ఈఎస్‌ఏకు చెందిన అనన్య జంట 420 క్లాస్ ఈవెంట్‌లో బంగారు పతకం గెలుచుకుంది. మూడు రోజుల పాటు జరిగిన మొత్తం 10 రేసుల్లో ఈ జంట ఆరు రేసుల్లో గెలుపొందింది. దీంతో 10 పాయింట్లతో విజేతగా నిలిచింది.
హైదరాబాద్‌కు చెందిన సంజయ్ రెడ్డి–అజయ్ యాదవ్ ద్వయం 12 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకుంది. మిగతా ఈవెంట్లలో భోపాల్ ఎన్‌ఎస్‌ఎస్‌కు చెందిన సెయిలర్లు సత్తా చాటుకున్నారు. లేజర్ 4.7 క్లాస్‌లో రామ్‌మిలన్ యాదవ్, ఆప్టిమిస్ట్ క్లాస్‌లో శ్రద్ధా వర్మ టైటిల్స్ గెలిచారు. లేజర్ 4.7 క్లాస్‌లో రామ్‌మిలన్ 10 రేసుల్లో ఏడు రేసులు గెలిచాడు. 9 పాయింట్లతో టైటిల్ చేజిక్కించుకున్నాడు. తమిళనాడు సెయిలర్లు మహేశ్ బాలచందర్ 25 పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా... అతని సహచరుడు అనికేత్ రాజారామ్ 27 పాయింట్లతో కాంస్యం నెగ్గాడు. ఆప్టిమిస్ట్ క్లాస్‌లో భోపాల్ సెయిలర్లు క్లీన్‌స్వీప్ చేశారు.
ప్రతీ రేసులోనూ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న శ్రద్ధా వర్మ విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా ఆమె ఆరు రేసుల్లో గెలిచి 11 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆశిష్ విశ్వకర్మ 20 పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా... దావుద్ ఖురేషి 22 పాయింట్లతో మూడో స్థానం పొందాడు.