సాక్షి, ఒంగోలు: ఆంధ్ర జట్టు బౌలర్లు మళ్లీ మెరిశారు. రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా కేరళతో ఇక్కడి సీఎస్‌ఆర్ శర్మ కాలేజీ మైదానంలో సోమవారం ఆరంభమైన మ్యాచ్‌లో తొలి రోజు ఆంధ్ర జట్టు పైచేయి సాధించింది. ఆంధ్ర బౌలర్లు మొహమ్మద్ రఫీ (5/62)తోపాటు పృథ్వీ రాజ్ (3/37), శశికాంత్ (2/38) హడలెత్తించడంతో కేరళ తమ తొలి ఇన్నింగ్స్ లో 49.5 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. రంజీ అరంగేట్రం మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసిన తొమ్మిదో ఆంధ్ర బౌలర్‌గా రఫీ గుర్తింపు పొందాడు. ఆట ముగిసే సమయానికి ఆంధ్ర వికెట్ నష్టపోయి 57 పరుగులు చేసింది.
హైదరాబాద్ 171 ఆలౌట్
రాజస్తాన్‌తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మరో మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకు ఆలౌటైంది. సుమంత్ (51; 7 ఫోర్లు) రాణించాడు. రాజస్తాన్ బౌలర్లు రితురాజ్, అనికేత్ చెరో 3 వికెట్లు తీశారు.
సర్ఫరాజ్ డబుల్ సెంచరీ...
ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కిన ముంబై బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్... హిమాచల్‌ప్రదేశ్‌తో ప్రారంభమైన మ్యాచ్‌లో అజేయ డబుల్ సెంచరీ (226 బ్యాటింగ్; 32 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో చెలరేగాడు. ఫలితంగా ముంబై తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు నష్టపోయి 372 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment