
ఆండ్రి రసెల్ బాదుడు
ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా? ఐపీఎల్‌లో ఇది సాధ్యమైంది.
బెంగళూరు: ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా? ఐపీఎల్‌లో ఇది సాధ్యమైంది. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రి రసెల్ ఈ ఫీట్ సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రసెల్ రప్ఫాడించాడు. సిక్సర్లతో సునామీ ఇన్నింగ్స్ ఆడి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. 13 బంతుల్లోనే ఏకంగా 48 పరుగులు బాదేసి 5 బంతులు మిగిలుండగానే కోల్‌కతాను గెలిపించాడు.
రసెల్ బ్యాట్ ఝళిపించడానికి ముందు కోల్‌కతా 16 బంతుల్లో 53 పరుగులు చేయాల్సి ఉంది. మహ్మద్ సిరాజ్ వేసిన 17వ ఓవర్ మూడో బంతిని సిక్సర్ కొట్టి రసెల్ పరుగుల వేట మొదలుపెట్టాడు. అది బీమర్ కావడంతో అంపైర్ సిరాజ్‌ను తప్పించి అతడి స్థానంలో వచ్చిన స్టాయినిస్‌కు బౌలింగ్ ఇచ్చాడు. సిరాజ్ బీమర్ వేయడంతో స్టాయినిస్ బౌలింగ్‌లో రసెల్‌కు ఫ్రీహిట్ ఛాన్స్ వచ్చింది. దీన్ని కూడా రసెల్ సిక్సర్ బాదాడు. దీంతో ఒక్క బంతికే 13 పరుగులు వచ్చినట్లయింది.
స్ట్రైక్ రేట్ సూపర్
ఇప్పటి వరకు ఈ లీగ్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఆండ్రి రసెల్ 77 బంతులు ఎదుర్కొని 268.83 స్ట్రైక్ రేట్‌తో 207 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 22 సిక్సర్లు ఉన్నాయి. (చదవండి: బెంగళూరు చిన్నబోయింది)