క్రికెట్ కమిటీ చైర్మన్‌గా మళ్లీ కుంబ్లే
సభ్యులుగా ద్రవిడ్, రవిశాస్త్రి
దుబాయ్: ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మరోసారి నియమితులయ్యారు. 2012లో తొలిసారిగా ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. తాజా నియామకంతో మరో మూడేళ్ల పాటు (2018 వరకు) ప్యానెల్ కు చీఫ్‌గా వ్యవహరించనున్నారు. ఇక కమిటీలో సభ్యులుగా రాహుల్ ద్రవిడ్‌కు చోటు లభించింది. తాజా ఆటగాళ్ల ప్రతినిధిగా ద్రవిడ్‌తో పాటు ఆసీస్ మాజీ స్పిన్నర్ టిమ్ మే నియామకం జరిగింది.
మాజీ ఆటగాళ్ల ప్రతినిధిగా శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్ధనే, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్‌ను నియమించారు. వీరంతా మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. మీడియా ప్రతినిధిగా కామెంటేటర్ రవిశాస్త్రి, అంపైర్ల ప్రతినిధిగా రిచర్డ్ కెటిల్‌బరో... ఎక్స్ అఫీషియో చైర్మన్లుగా శశాంక్ మనోహర్, డేవ్ రిచర్డ్‌సన్ వ్యవహరిస్తారు. ఈనెల 31, జూన్ 1న లార్డ్స్‌లో జరిగే ఐసీసీ వార్షిక సమావేశంలో కమిటీ తొలి సమావేశం జరుగుతుంది.