కుంబ్లేకు తోడుగా ద్రవిడ్!
టీమిండియా కోచ్‌గా బాధ్యతలు!
ముంబై: భారత జట్టును విజయపథంలో నడిపిస్తోన్న కోచ్ అనిల్ కుంబ్లేకు పదోన్నతి ఇవ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భావిస్తోంది. ఆయన స్థానంలో కోచ్‌గా యువ భారత్ (జూనియర్ జట్టు)ను తీర్చిదిద్దిన రాహుల్ ద్రవిడ్‌కు టీమిండియా ప్రధాన కోచ్ బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది. ‘జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా నిర్మాణాత్మక మార్పు లతో ముందుకెళ్లాలనుకుంటున్నాం. మా ప్రణాళికల్లో భాగంగా టీమ్ డైరెక్టర్‌గా భారత జట్లను (సీనియర్, జూనియర్, మహిళలు) పర్యవేక్షించేందుకు సమర్థు డైన వ్యక్తిని నియమించాలనుకుంటున్నాం.
దీంతో డైరెక్టర్, కోచ్‌లు సమన్వయంతో పనిచేసేందుకు వీలవుతుంది’ అని బోర్డు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే భారత జట్లపై పూర్తిస్థాయి నివేదికను అందజేయాలని సీఓఏ ఇటీవల కుంబ్లేను కోరింది. అలాగే భారత దిగ్గజాలతో ఏర్పాటైన క్రికెట్ సలహా కమిటీని రద్దు చేయాలని సీఓఏ భావిస్తుంది. సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన ఈ కమిటీలో ఒకరిని క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్‌గా నియమించాలని చూస్తోంది.
వీరిద్దరితోనే ఎందుకంటే..?
సీనియర్ జట్టును కుంబ్లే, జూనియర్ జట్టును ద్రవిడ్ చక్కగా నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనను మరింత పటిష్టపరిచేందుకు వీరిద్దరికి కీలక బాధ్యతలు కట్టబెట్టి... తద్వారా టీమ్ మేనేజ్‌మెంట్‌ను దిగ్గజాలతో భర్తీచేయాలని బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) యోచిస్తోంది. గతేడాది జూన్‌లో కుంబ్లే ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ఇంకా ఏడాది కూడా పూర్తవని ఈ కాలంలోనే భారత్ గొప్ప విజయాలు సాధించింది. 2–0తో వెస్టిండీస్‌పై, 3–0తో న్యూజిలాండ్‌పై, 4–0తో ఇంగ్లండ్‌పై, 1–0తో బంగ్లాదేశ్‌పై ఘనవిజయాలు నమోదు చేసింది. దీంతో భారత్ టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంకుతోపాటు త్వరలో ఐసీసీ ‘గద’ను అందుకోనుంది. సానుకూల దృక్పథం ఉన్న కుంబ్లేకు టీమ్ డైరెక్టర్‌గా ప్రమోషన్ ఇవ్వాలని, ఆయనకు చేదోడువాదోడుగా ద్రవిడ్‌ను టీమ్ మేనేజ్‌మెంట్‌లో భాగం చేయాలని సీఓఏ నిర్ణయించినట్లు సమాచారం.