క్రికెటర్ అంకిత్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం!
న్యూఢిల్లీ:గత ఏప్రిల్ నెలలో క్రికెట్ ఆడుతూ మృతిచెందిన బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరీ కుటుంబానికి బీసీసీఐ బీమా పథకం నుంచి రూ.25 లక్షల పరిహారం అందనుంది. ఈ మేరకు న్యాయపరమైన వ్యవహారాలు పూర్తయినట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సెక్రటరీ సుబీర్ గంగూలీ తెలిపాడు.
ఇప్పటికే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అంకిత్ కు సంబంధించిన బీమా పరిహారపు చెక్ బీసీసీఐకి అందినట్లు సుబీర్ తెలిపాడు. ఆ పరిహారాన్ని త్వరలోనే అంకిత్ కేసరీ కుటుంబానికి అందించనున్నట్లు సుబీర్ తెలిపాడు. ఇందుకు సహకరించిన బీసీసీఐకి సుబీర్ గంగూలీ కృతజ్ఞతలు తెలిపాడు. బీసీసీఐ పరిధిలోకి వచ్చే క్రికెటర్లకు ప్రమాద బీమాను వర్తింపజేయడం తెలిసిన విషయమే. సాధారణంగా క్రికెట్ ఆడుతూ క్రికెటర్ మృతి చెందితే వారికి వర్తింప జేసే బీమా పరిహారం గరిష్టంగా రూ. 25 లక్షలు ఉంటుంది.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈస్ట్ బెంగాల్ - భావన్ పురీ జట్ల మధ్య జరిగిన స్థానిక మ్యాచ్ లో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన కేసరీ మైదానంలో వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి మరో క్రికెటర్ను ఢీకొట్టాడు. తలకు బలమైన గాయంతో నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన కేసరీ ప్రాణాలు కోల్పోయాడు. మ్యాచ్ జరిగిన రోజున ఈస్ట్ బెంగాల్ జట్టులో అతడు 12వ ఆటగాడు మాత్రమే.ఫీల్డింగ్ చేస్తున్న ఆర్నాబ్ నంది అనే ఆటగాడు బ్రేక్ తీసుకోవడంతో అతడి స్థానంలో మైదానంలోకి వచ్చిన కేసరీ క్యాచ్ పట్టబోయి కుప్పకూలిపోయాడు.