
బెంగాల్ వారియర్స్‌కు మరో విజయం
నాగ్‌పూర్: ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగాల్ వారియర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన జోన్ ‘బి’ మ్యాచ్‌లో వారియర్స్ 40–20తో యూపీ యోధ జట్టును చిత్తుగా ఓడించింది. బెంగాల్ ఆటగాళ్లలో వినోద్ కుమార్ 8 పాయింట్లతో చెలరేగగా, జంగ్ కున్‌లీ ఏడు, మణీందర్ సింగ్ ఆరు పాయింట్లతో ఆకట్టుకున్నారు. యూపీ యోధ జట్టు తరఫున సురేందర్ సింగ్ (5 పాయింట్లు) టాప్ స్కోరర్ కాగా... రాజేశ్ నర్వాల్ (3) కూడా రాణిం చాడు.
మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ పట్నా పైరేట్స్ 46–32తో బెంగళూరు బుల్స్‌పై గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. పైరేట్స్ జట్టులో ప్రదీప్ నర్వాల్ 15 పాయింట్లతో అద్భుత ప్రదర్శన చేయగా, మను గోయట్, వినోద్ కుమార్ చెరో 7 పాయింట్లు సాధించారు. బుల్స్ తరఫున రోహిత్ కుమార్ (8) అజయ్ (6) మెరుగ్గా ఆడారు. నాగ్‌పూర్ అంచె పోటీలకు నేడు విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్‌తో హర్యానా స్టీలర్స్, బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్‌ల్ని స్టార్ స్పోర్ట్స్–2 ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.