లండన్: సుమారు ఐదేళ్ల క్రితం తాను ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకుంటే చాలా చులకన భావంతో చూశారని ఆ దేశ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తాజాగా పేర్కొన్నాడు. తాను ఇంగ్లండ్ జట్టుకు కోచ్‌గా చేయాలనేది తన కోరికని, దానిలో భాగంగా దరఖాస్తు చేసుకుంటే చిన్నచూపు చూశారంటూ చెప్పుకొచ్చాడు. ‘2014లో ఇంగ్లండ్ కోచ్ పదవి కోసం అప్లై చేశా. ఇంటర్యూ కోసం ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేశా. నెల గడిచినా నాకు ఎటువంటి సమాధానం రాలేదు. అయితే అసలు ఏమైందని కనుక్కుంటే అప్పుడు నాకు ఫోన్ వచ్చింది. కోచ్ పదవిని వేరే వాళ్లకు ఇచ్చేశామనే సమాధానం వచ్చింది. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేస్తే కనీసం ఏమి జరిగిందనేది నేను ఆరా తీసే వరకూ తెలియకపోవడం దారుణం.
నాకు కోచింగ్ చేయడమనేది ఒక కోరిక. ఇంగ్లండ్ జట్టుకు కోచ్‌గా చేయాలని ఉంది. దాంతో లాంకాషైర్ కూడా కోచ్‌గా చేయడాన్ని ఇష్టపడతా’ అని ఫ్లింటాఫ్ పేర్కొన్నాడు. ఏదొక రోజు ఇంగ్లండ్‌కు కోచ్‌గా చేసే అవకాశం వస్తుందనే అనుకుంటున్నానని, ప్రస్తుతానికి ఇంకా అది తన తలుపు తట్టలేదన్నాడు.2009 యాషెస్ సిరీస్ గెలిచిన జట్టులో ఫ్లింటాఫ్ సభ్యుడు. 2006-07 సీజన్ యాషెస్ సిరీస్‌లో ఆసీస్ చేతిలో 5-0 తేడాతో వైట్‌వాష్ అయిన ఇంగ్లండ్ జట్టుకు ఫ్లింటాఫ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. తన కెరీర్‌లో 79 టెస్టులు, 141 వన్డేలకు ఫ్లింటాఫ్ ప్రాతినిథ్యం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment