టీమిండియా ప్రధాన పేసర్ మొహమ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. షమీ భార్య హసీన్ జహాన్ దాఖలు చేసిన గృహ హింస ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అలీపూర్ కోర్టు షమీతో పాటు ఆయన సోదరుడు హసీద్ అహ్మద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 15 రోజుల్లోగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. అలాగే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు 15 రోజుల గడువు ఇచ్చింది. కాగా, గతేడాది షమీ తనను వేధిస్తున్నట్టు అతడి భార్య కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో షమీతోపాటు అతని సోదరుడిపై ఐపీసీ సెక్షన్ 498ఏ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు షమీ ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. కాగా, ఈ ఘటనపై స్పందించిన బీసీసీఐ.. చార్జ్‌షీట్‌ను పూర్తిగా పరిశీలించేవరకు షమీపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment