
స్టన్నింగ్ స్టోక్స్
ప్రపంచ నంబర్‌వన్ టెస్టు జట్టు దక్షిణాఫ్రికాకు బెన్ ‘స్టోక్స్’ దెబ్బ గట్టిగానే తాకింది. బరిలోకి దిగింది ఆరో నంబర్‌లోనైనా...
* 163 బంతుల్లో డబుల్ సెంచరీ
* బెయిర్‌స్టో సెంచరీ
* తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 629/6 డిక్లేర్డ్
* దక్షిణాఫ్రికా 141/2
కేప్‌టౌన్: ప్రపంచ నంబర్‌వన్ టెస్టు జట్టు దక్షిణాఫ్రికాకు బెన్ ‘స్టోక్స్’ దెబ్బ గట్టిగానే తాకింది. బరిలోకి దిగింది ఆరో నంబర్‌లోనైనా... సఫారీ బౌలర్లను ఊచకోత కోస్తూ తను మైదానంలో విలయతాండవం చేశాడు. ఆడుతుంది టెస్టా.. టి20 మ్యాచా అనే అనుమానాన్ని కలిగిస్తూ సుడిగాలి ఇన్నింగ్స్‌తో పరుగుల వర్షం కురిపించాడు.
ఏకంగా 11 సిక్సర్లు, 30 ఫోర్లు బాదిన బెన్ స్టోక్స్ ఈ ఫార్మాట్‌లో రెండో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ (163 బం తుల్లో) చేశాడు. స్టోక్స్ (198 బంతుల్లో 258)తో పాటు జానీ బెయిర్‌స్టో (191 బంతుల్లో 150 నాటౌట్; 18 ఫోర్లు; 2 సిక్సర్లు) శతకం సాధించడంతో రెండో రోజు ఇంగ్లండ్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 125.5 ఓవర్లలో ఆరు వికెట్లకు 629 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రబడాకు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో రెండు వికెట్లకు 141 పరుగులు చేసింది. క్రీజులో ఆమ్లా (124 బంతుల్లో 64 బ్యాటింగ్; 10 ఫోర్లు), డి విలియర్స్ (51 బంతుల్లో 25 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఉన్నారు.
ఓవర్‌నైట్ స్కోరు 317/5తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ సఫారీలకు చుక్కలు చూపించారు. స్టోక్స్, బెయిర్‌స్టో ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలి నాలుగు ఓవర్లలోనే 45 పరుగులు రాబట్టారు. ముఖ్యంగా స్టోక్స్ 105 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకుని ఆ తర్వాత మరింత వేగం పెంచాడు. దీంతో లంచ్ విరామానికి కాస్త ముందు 163 బంతుల్లోనే కెరీర్‌లో తొలి ద్విశతకాన్ని సాధించాడు.
ఈ దూకుడుతో ఆ ఒక్క సెషన్‌లోనే 130 పరుగులు చేశాడు. అటు బెయిర్‌స్టో 161 బంతుల్లో సెంచరీ చేశాడు. అయితే డ్రింక్స్ బ్రేక్ తీసుకున్న కొద్ది సేపటికే స్టోక్స్.. ర బడా వేసిన బంతిని గాల్లోకి లేపగా క్యాచ్ విఫలమైంది. అయితే వేగంగా స్పందించిన డి విలియర్స్ బంతిని నాన్ స్ట్రయిక్ ఎండ్‌వైపు విసరగా అతడు రనౌట్ అయ్యాడు. అదే ఓవర్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
1 ఆరో నంబర్ స్థానంలో స్టోక్స్‌దే అత్యధిక వ్యక్తిగత స్కోరు
163 స్టోక్స్ టెస్టుల్లో రెండో వేగవంతమైన డబుల్ సెంచరీ చేశాడు. ఆస్టిల్ (న్యూజిలాండ్, 153 బంతులు) వేగంగా డబుల్ సెంచరీ చేశాడు.
11 స్టోక్స్ కొట్టిన సిక్సర్లు. అక్రమ్ (12) తర్వాత టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు ఇవి.
14 సొంత గడ్డపై దక్షిణాఫ్రికా ప్రధాన బౌలర్లంతా వందకు పైగా పరుగులివ్వడం 2002 తర్వాత ఇప్పుడే.
6.91 స్టోక్స్, బెయిర్ స్టో 6.91 రన్‌రేట్‌తో పరుగులు జోడించారు. (346 బంతుల్లో 399 పరుగులు). టెస్టు క్రికెట్‌లో వేగంగా పరుగులు చేసిన జోడిగా రికార్డు సృష్టించారు.
399
స్టోక్స్, బెయిర్‌స్టో ఆరో వికెట్‌కు జోడించిన పరుగులు. టెస్టుల్లో ఈ వికెట్‌కు ఇదే అత్యధికం. ఓవరాల్‌గా అన్ని వికెట్లలో ఇంగ్లండ్‌కు రెండో అత్యుత్తమం. అలాగే దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక భాగస్వామ్యం.
130
రెండో రోజు తొలి సెషన్‌లో స్టోక్స్ చేసిన పరుగులు. టెస్టుల్లో తొలి సెషన్‌లో అత్యధిక పరుగులు ఇవే.