
అశ్విన్ మరోసారి అందుకుంటాడా?
దుబాయ్: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి అగ్రస్థానానికి చేరువలో నిలిచాడు. న్యూజిలాండ్ తో జరిగే రెండో టెస్టులోనూ రాణిస్తే అతడు టాప్ ర్యాంకు దక్కించుకునే అవకాశముంది. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ లో అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ను అధిగమించి సెకండ్ ర్యాంకు దక్కించుకున్నాడు. అగ్రస్థానానికి ఏడు పాయింట్ల దూరంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ 878 పాయింట్లతో టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. గతేడాది తొలిసారిగా అశ్విన్ ఫస్ట్ ర్యాంకు అందుకున్నాడు. బాక్సింగ్ డే టెస్టులో రాణించి అగ్రస్థానం దక్కించుకున్నాడు.
బ్యాటింగ్ విభాగంలో అజింక్య రహానే టాప్-10 నుంచి పడిపోయి 11వ ర్యాంకులో నిలిచాడు. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి 4 స్థానాలు పడిపోయి 20వ ర్యాంకులో ఉన్నాడు.