దుబాయ్ : ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో రికార్డుల రారాజుగా వెలుగుతున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఖాతాలో మరో మణిహారం వచ్చి చేరింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లి తిరిగి నంబర్ వన్ స్థానాన్ని అధిరోహించాడు. పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ ఘోరంగా విపలమయ్యాడు. దీంతో 15 పాయింట్లు కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. ఇదే క్రమంలో దక్షిణాప్రికాపై డబుల్ సెంచరీ, బంగ్లాదేశ్‌తో జరిగిన డేనైట్ టెస్టులో సెంచరీ చేసిన కోహ్లి 928 పాయింట్లతో ఆగ్రస్థానానికి ఎగబాకాడు.
బాల్ ట్యాంపరింగ్ ఉదంతం అనంతరం నిషేదానికి గురై ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌తో పునరాగమనం చేసిన స్టీవ్ స్మిత్.. ఆ సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నాలుగు టెస్టుల్లో ఏకంగా 774 పరుగులు రాబట్టి తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. అంతేకాకుండా అప్పటివరకు నంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్న కోహ్లిని పక్కకు నెట్టి తిరిగి నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తాజాగా పాక్ సిరీస్‌లో (4, 36) విఫలమైన స్మిత్ భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. అయితే డిసెంబర్ 12 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో స్మిత్ రాణించినట్లయితే కొత్త సంవత్సరంలో ఆగ్రస్థానాన్ని తిరిగి కైవసం చేసుకునే అవకాశం ఉంది.
ఇక పాక్ టెస్టులో స్మిత్ విఫలమైనా డేవిడ్ వార్నర్, లబుషేన్‌లు రాణించడంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. ట్రిపుల్ సెంచరీ సాధించిన వార్నర్ 12 నుంచి 5వ స్థానానికి ఎగబాకాడు. వార్నర్‌కు పోటీ పడి పరుగులు సాధించిన మరో ఆసీస్ బ్యాట్స్‌మన్ లబుషేన్ కూడా ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో 110వ స్థానంలో ఉన్న లబుషేన్.. ఏడాది చివరికి టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషం. వార్నర్ ఐదో స్థానానికి చేరుకోవడంతో టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఆరో స్థానానికి పడిపోయాడు. ఇక కోహ్లి, రహానేలతో పాటు మరో టీమిండియా బ్యాట్స్‌మన్ పుజారా(4) టాప్ 10లో కొనసాగుతున్నాడు.
ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. ఆసీస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ 900 పాయింట్లతో ఆగ్రస్థానంలో, దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడా 839 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక వరుసగా రెండు టెస్టు సిరీస్‌లకు దూరమైన టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ 9వ స్థానాన్ని కపాడుకోగా.. మహ్మద్ షమీ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. కాగా, ఆల్‌రౌండర్ల జాబితాలో జాసన్ హోల్డర్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. పాక్ సిరీస్‌లో బంతితో పాటు బ్యాట్‌తో మెరిసిని మిచెల స్టార్క్ ఆరో స్థానానికి ఎగబాకాడు. ఇక వరుస టెస్టు సిరీస్ విజయాలతో టీమిండియా 120 పాయింట్లతో ఆగ్రస్థానంలో కొనసాగుతోంది.
Virat Kohli back to No.1!
— ICC (@ICC) December 4, 2019
David Warner, Marnus Labuschagne and Joe Root make significant gains in the latest @MRFWorldwide ICC Test Rankings for batting.
Full rankings: https://t.co/AIR0KN4yY5 pic.twitter.com/AXBx6UIQkL
Comments
Please login to add a commentAdd a comment