అమ్మాయిలు రెట్టింపు శ్రమించాలి!
అప్పుడే వివక్షను అధిగమించవచ్చు
క్రీడాకారిణిగా ఎదగడం సులువు కాదు
సాక్షితో భారత క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్
సాక్షి, హైదరాబాద్: అమ్మాయిలకు క్రికెట్ ఏమిటి అని అందరూ అనుకొనే రోజుల్లోనే ఆటపై మక్కువతో ముందడుగు వేసింది మిథాలీరాజ్. ఇప్పటికే 12ఏళ్లు భారత జట్టుకు ఆడింది. అందులోనూ దాదాపు సగభాగం జాతీయ జట్టుకు నాయకురాలిగా వ్యవహరించడం మిథాలీ ప్రతిభకు నిదర్శనం. ఆరంభంలో వివక్షను ఎదుర్కొన్నా పట్టుదలతో ముందుకు సాగిన ఆమె మహిళలకు ఆదర్శం.
మన రాష్ట్రంలో మహిళా క్రికెట్‌కు పర్యాయ పదమైన మిథాలీ 148 వన్డేల్లో 50.43 సగటుతో 4791 పరుగులు చేసింది. ఇందులో 71 మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. మరో 8 టెస్టులు, 39 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు కూడా ఆడింది. బంగ్లాదేశ్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌లో భారత జట్టును నడిపించనున్న మిథాలీ... తమ జట్టు ప్రదర్శన, సమాజంలో మహిళల అవకాశాలపై సాక్షితో ముచ్చటించింది. విశేషాలు ఆమె మాటల్లోనే...
క్రికెటర్‌గా ఎదగడంలో ఎదుర్కొన్న ఇబ్బందులు
సహజంగానే ఆరంభంలో చాలా రకాలుగా నేనూ ఇబ్బంది పడ్డాను. క్రికెట్ ఆడతానని చెప్పినప్పుడు అబ్బాయిలు తరచుగా ఆట పట్టించేవారు. ఇప్పుడలాంటి పరిస్థితి లేదనుకోండి. వాస్తవానికి వ్యక్తిగత క్రీడలతో పోలిస్తే క్రికెట్‌లాంటి ఆటలో ముందుకు వెళ్లటం అంత సులభం కాదు. అయితే నేను కుటుంబ సభ్యుల సహకారంతో పట్టుదల కనబర్చాను. ఆట మొదలు పెట్టినప్పుడు ఇన్నేళ్లు భారత్‌కు ఆడతానని ఊహించలేదు. నా సక్సెస్ తర్వాత హైదరాబాద్‌లో చాలా మంది అమ్మాయిలు క్రికెట్ వైపు మొగ్గు చూపడం ఆనందం కలిగించింది.
భారత క్రికెట్ జట్టు ప్రదర్శన, గుర్తింపుపై...
సుదీర్ఘ కాలం పాటు భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం రావడం నా అదృష్టం. జట్టు బాగా ఆడుతున్నా నిలకడ లేకపోవడం వల్ల ప్లేయర్లకు తగిన గుర్తింపు దక్కడం లేదు. సాధారణంగా మేం ఆడే మ్యాచ్‌లు తక్కువ. 1-2 మ్యాచ్‌లలో ప్లేయర్లకు అవకాశం ఇస్తున్నారు. అక్కడ విఫలం కాగానే జట్టు సభ్యులు మారిపోతున్నారు. నాలాంటి ఒకరిద్దరు సీనియర్లు తప్ప ప్రతి సిరీస్‌కు కొత్తవాళ్లే కావడంతో నిత్యం సంధికాలం లాగానే కనపిస్తోంది. ఇప్పటికీ మన పక్కింట్లో భారత క్రికెటర్ ఉంటున్నా ఎంతో మంది వారిని గుర్తుపట్టరు. నాకంటూ కొంత గుర్తింపు వచ్చినా అది అందరికీ రావాలని కోరుకుంటున్నాను.
క్రీడా రంగంలో వివక్ష కొనసాగుతోందా?
నిజాయితీగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా అమ్మాయిల పట్ల వివక్ష కనిపిస్తూనే ఉంటుంది. ఏ స్థాయికి ఎదిగినా అది తప్పదు. అయితే క్రీడాకారిణులు మానసికంగా దృఢంగా ఉంటారు.
అందువల్ల బేలగా మారిపోకుండా సమర్థంగా ఎదుర్కోగలరు. ఆర్ధికంగా కూడా తన కాళ్లపై తాను నిలబడితే ఎవరి అండ అవసరం ఉండదు. ఏదైనా తేడా వస్తే వెంటనే స్పందించే ధైర్యం కూడా వస్తుంది. క్రీడాకారిణులు కాకుండా ఇతరత్రా చాలా మంది అమ్మాయిలు తమను తాము తక్కువగా భావించుకుంటూ సాగిపోతారు. నా అనుభవాన్ని చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలు ముందుకు వెళ్లాలంటే రెట్టింపు శ్రమించాల్సి ఉంటుంది.
టి20 ప్రపంచకప్ అవకాశాలపై...
మన జట్టును టి20ల్లో ఇప్పటికీ పసికూనగానే చెప్పవచ్చు. ఆ తరహా వేగం, పవర్ గేమ్ ఇంకా మనకు రాలేదు. మనది బేసిగ్గా వన్డే జట్టు. అందుకే ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లను కూడా ఓడించగలిగాం. కానీ టి20లకు అవసరమైన ధాటైన బ్యాటింగ్ ఇంకా మెరుగు పడాల్సి ఉంది. వరల్డ్ కప్‌కు ముందు బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడబోతున్నాం. మన జట్టులో నాతో పాటు మరో ఇద్దరు ప్లేయర్లు (స్రవంతి, గౌహర్), ముగ్గురు సహాయక సిబ్బంది హైదరాబాద్‌వారే కావడం చెప్పుకోదగ్గ విశేషం. వారితో కలిసి పని చేయడం సులువవుతుంది.
మహిళా క్రికెట్‌కు బీసీసీఐ సహకారం
మహిళల క్రికెట్ బీసీసీఐలో విలీనం అయిన తర్వాత ఏదో అద్భుతం జరిగిందని చెప్పలేం కానీ కచ్చితంగా మెరుగు పడిందని మాత్రం చెప్పగలను. మ్యాచ్ ఫీజులవంటి విషయంలో చర్చ అనవసరం. అయితే నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లాంటి అత్యున్నత స్థాయి సౌకర్యాలు ఉపయోగించుకునే అవకాశం రావడం, గుంటూరులో మహిళలతో ప్రత్యేక అకాడమీ రావడం, టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు ఇలాంటివే. క్రీడాకారిణులు గాయపడితే పునరావాస సౌకర్యంలాంటివి కూడా కల్పిం చారు. ఇతర జట్లతో పోలిస్తే మ్యాచ్‌ల సంఖ్యనే పెరగాల్సి ఉంది. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం వస్తే భారత్ కూడా అగ్రశ్రేణి జట్టుగా ఎదుగుతుంది.