
తొలి డే -నైట్ టెస్టుకు ఉస్మాన్ దూరం
పెర్త్: న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో వరుసగా రెండు సెంచరీలతో అదరగొట్టిన ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖాజా గాయం కారణంగా జట్టు నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. కివీస్ తో రెండో టెస్టులో భాగంగా రెండో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఉస్మాన్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఉస్మాన్ కు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఫిజియోథెరఫీ డేవిడ్ బీక్లీ స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం కివీస్ తో జరుగుతున్నరెండో టెస్టుతో పాటు, నవంబర్ 27 నుంచి అడిలైడ్ లో జరిగే తొలి డే అండ్ నైట్ మ్యాచ్ కు ఉస్మాన్ దూరం కావాల్సి వచ్చింది. తొలిసారి పింక్ బాల్ తో ఈ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించనున్నారు.
కాగా, డిసెంబర్ 10 నుంచి హోబార్ట్ లో వెస్టిండీస్ తో జరిగే తొలి టెస్టులో కూడా ఉస్మాన్ పాల్గొనబోడని సీఏ ఆదివారం ప్రకటించింది. మెల్ బోర్న్ లో విండీస్ తో జరిగే రెండో టెస్టు నాటికి ఉస్మాన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో మొదటి టెస్టు సెంచరీను నమోదు చేసిన ఉస్మాన్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో శతకంతో ఆకట్టుకున్నాడు.