
ఆసీస్ భారీ స్కోరు
పెర్త్: మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు నమోదు చేసింది. 416/2 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల నష్టానికి 559 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆసీస్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్(253), ఉస్మాన్ ఖాజా(121)లతో మరోసారి ఆకట్టుకుని జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించారు. ఆసీస్ జట్టులో బర్స్స్(40), వోజస్ (40), మిచెల్ మార్ష్(34)లు ఫర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో క్రెయిగ్ మూడు వికెట్లు లభించగా, బౌల్ట్, హెన్రీ, బ్రాస్ వెల్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ ఆదిలోనే తడబడింది. ఓపెనర్ మార్టిన్ గుప్తిల్(1) పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. అనంతరం టామ్ లాథమ్(36) రెండో వికెట్ గా వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ 87 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను విలియమ్సన్(70 బ్యాటింగ్), రాస్ టేలర్(26 బ్యాటింగ్) తమపై వేసుకోవడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ రెండు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది.