
భారత్ చేతిలో పరాజయం తర్వాత ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా ఒక్కసారిగా చెలరేగుతోంది. గత రెండు మ్యాచ్‌లలో పాకిస్తాన్, శ్రీలంకలను ఓడించి జోరు పెంచిన కంగారూలు ఇప్పుడు ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందుకున్నారు. తనదైన శైలిలో చెలరేగిన డేవిడ్ వార్నర్ మరో భారీ సెంచరీతో కదం తొక్కగా... ఉస్మాన్ ఖాజా, ఫించ్ అండగా నిలిచి భారీ స్కోరుకు కారణమయ్యారు. చిన్నదైన ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో బంగ్లా పేలవ బౌలింగ్‌ను చితక్కొట్టిన ఆసీస్ పరుగుల వరద పారించింది. కొండంత లక్ష్యం ముందుండగా బంగ్లా పోరాడేందుకు సిద్ధమైంది. సీనియర్లు ముష్ఫికర్, మహ్ముదుల్లా, తమీమ్, షకీబ్ తమ స్థాయిలో గట్టిగా ప్రయత్నించినా... వన్డేల్లో తమ అత్యధిక స్కోరు చేసినా విజయానికి చేరువలో రాలేకపోయింది. గత మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ఆటతో విండీస్‌పై భారీ లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటిన బంగ్లా... ఆసీస్ పదునైన బౌలింగ్‌లో మాత్రం చివరి వరకు అదే ధాటిని కనబర్చలేక ఓటమిపాలైంది.
నాటింగ్‌హామ్: డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్‌లో ఐదో విజయంతో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. గురువారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆసీస్ 48 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వార్నర్ (147 బంతుల్లో 166; 14 ఫోర్లు, 5 సిక్సర్లు) కెరీర్‌లో 16వ సెంచరీ సాధించాడు. ఉస్మాన్ ఖాజా (72 బంతుల్లో 89; 10 ఫోర్లు), ఆరోన్ ఫించ్ (51 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక పాత్ర పోషించారు. తొలి వికెట్‌కు ఫించ్‌తో 121 పరుగులు జోడించిన వార్నర్, రెండో వికెట్‌కు ఖాజాతో 192 పరుగులు జత చేశాడు. అనంతరం బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 333 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (97 బంతుల్లో 102 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్‌లో ఏడో సెంచరీ సాధించగా... మహ్ముదుల్లా (50 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), తమీమ్ ఇక్బాల్ (74 బంతుల్లో 62; 6 ఫోర్లు), షకీబ్ అల్ హసన్ (41 బంతుల్లో 41; 4 ఫోర్లు) రాణించారు.
రెండు శతక భాగస్వామ్యాలు...
ఆస్ట్రేలియాకు ఓపెనర్లు వార్నర్, ఫించ్ మరోసారి అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. గత మ్యాచ్‌లో ఫించ్ భారీ సెంచరీతో చెలరేగిపోతే ఈసారి ఆ బాధ్యతను వార్నర్ తీసుకున్నాడు. వీరిద్దరి చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను షబ్బీర్ వదిలేయడం ఆసీస్‌కు కలిసొచ్చింది. పది ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు 53 పరుగులకు చేరింది. ఇదే జోరులో ముందుగా వార్నర్ 55 బంతుల్లో, ఆ తర్వాత ఫించ్ 47 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఎట్టకేలకు ఫించ్‌ను తన తొలి ఓవర్లోనే ఔట్ చేసి పార్ట్‌టైమర్ సౌమ్య సర్కార్ ఓపెనింగ్ జోడీని విడదీశాడు.
వన్‌డౌన్‌లో వచ్చిన ఖాజా వార్నర్‌కు చక్కటి సహకారం అందించాడు. షకీబ్ బౌలింగ్‌లో సింగిల్‌తో ఈ ప్రపంచ కప్‌లో వార్నర్ రెండో సెంచరీ (110 బంతుల్లో) పూర్తయింది. అనంతరం సైతం వార్నర్, ఖాజా దూకుడు తగ్గకుండా ఆడారు. ఫలితంగా ప్రపంచకప్ చరిత్రలో ఆసీస్ తొలిసారి మొదటి రెండు వికెట్లకు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసింది. సరిగ్గా 50 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఖాజా.. ముస్తఫిజుర్ వేసిన ఇన్నింగ్స్ 42వ ఓవర్లో పండగ చేసుకున్నాడు. ఈ ఓవర్లో 4 ఫోర్లు కొట్టిన మొత్తం 19 పరుగులు రాబట్టడం విశేషం. వార్నర్ ధాటిని కొనసాగిస్తూ 150 పరుగుల మైలురాయి (139 బంతుల్లో) అధిగమించాడు. చివరకు సర్కార్ బౌలింగ్‌లోనే థర్డ్‌మ్యాన్‌కు క్యాచ్ ఇవ్వడంతో అతడి అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది.
నంబర్ 4లో దిగిన మ్యాక్స్‌వెల్ (10 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నంత సేపు అదరగొట్టాడు. రూబెల్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4, 6 బాదాడు. ఖాజా మరో ఫోర్ కొట్టడంతో ఈ ఓవర్లో 25 పరుగులు వచ్చాయి. రెండు పరుగుల వ్యవధిలో ఆసీస్ 3 వికెట్లు కోల్పోయింది. ఖాజాతో సమన్వయ లోపంతో మ్యాక్సీ రనౌట్ కాగా... ఖాజా, స్మిత్ (1) వెంటవెంటనే వెనుదిరిగారు. 49 ఓవర్ల తర్వాత వర్షంతో ఆట ఆగిపోయినా... కొద్ది సేపటికి అంపైర్లు మళ్లీ కొనసాగించారు. చివరి ఓవర్లో స్టొయినిస్ (17 నాటౌట్) రెండు ఫోర్లు కొట్టడంతో మరో 13 పరుగులు జతచేరాయి. చివరి పది ఓవర్లలో ఆస్ట్రేలియా ఏకంగా 131 పరుగులు సాధించడం విశేషం.
రాణించిన షకీబ్...
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాకు పేలవ ఆరంభం లభించింది. లేని సింగిల్ తీసే ప్రయత్నంలో సౌమ్య సర్కార్ (10) రనౌట్ కావడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఇద్దరు సీనియర్లు తమీమ్, షకీబ్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. సూపర్ ఫామ్‌లో ఉన్న షకీబ్ అదే జోరును కొనసాగించగా, తమీమ్ సొగసైన షాట్లు ఆడారు. ఫలితంగా పవర్‌ప్లే ఆసీస్‌లాగే బంగ్లా సరిగ్గా 53 పరుగులు చేసింది. వీరిద్దరు రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించాక స్టొయినిస్ బౌలింగ్‌లో షకీబ్ వెనుదిరిగాడు. 65 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తమీమ్‌ను అద్భుత బంతితో స్టార్క్ బౌల్డ్ చేయడంతో బంగ్లా కష్టాల్లో పడింది.
లిటన్ దాస్ (20) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ దశలో ముష్ఫికర్, మహ్ముదుల్లా జోడి బంగ్లా బృందంలో విజయంపై ఆశలు రేపింది. వీరిద్దరు ఒకరితో పోటీ పడి మరొకరు దూకుడుగా ఆడారు. 54 బంతుల్లో ముష్ఫికర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, జంపా ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన మహ్ముదుల్లా 41 బంతుల్లోనే ఆ మైలురాయిని అందుకున్నాడు. 80 బంతుల్లోనే ఈ భాగస్వామ్యం 100 పరుగులు దాటడం విశేషం. సాధించాల్సిన రన్‌రేట్ బాగా పెరిగిపోయిన పరిస్థితుల్లో... 28 బంతుల్లో 80 పరుగులు చేయాల్సి ఉండగా మహ్ముదుల్లా, షబ్బీర్ (0)లను వరుస బంతుల్లో కూల్టర్ నైల్ ఔట్ చేయడంతో బంగ్లా పరాజయం ఖాయమైంది.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) రూబెల్ (బి) సర్కార్ 166; ఫించ్ (సి) రూబెల్ (బి) సర్కార్ 53; ఖాజా (సి) ముష్ఫికర్ (బి) సర్కార్ 89; మ్యాక్స్‌వెల్ (రనౌట్) 32; స్టొయినిస్ (నాటౌట్) 17; స్మిత్ (ఎల్బీ) (బి) ముస్తఫిజుర్ 1; క్యారీ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ) 381.
వికెట్ల పతనం: 1–121, 2–313, 3–352, 4–353, 5–354.
బౌలింగ్: మొర్తజా 8–0–56–0, ముస్తఫిజుర్ 9–0–69–1, షకీబ్ 6–0–50–0, రూబెల్ 9–0–83–0, మెహదీ హసన్ 10–0–59–0, సర్కార్ 8–0–58–3.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (బి) స్టార్క్ 62; సర్కార్ (రనౌట్) 10; షకీబ్ (సి) వార్నర్ (బి) స్టొయినిస్ 41; ముష్ఫికర్ (నాటౌట్) 102; లిటన్ దాస్ (ఎల్బీ) (బి) జంపా 20; మహ్ముదుల్లా (సి) కమిన్స్ (బి) కూల్టర్‌నైల్ 69; షబ్బీర్ రహమాన్ (బి) కూల్టర్‌నైల్ 0; మెహదీ హసన్ (సి) వార్నర్ (బి) స్టార్క్ 6; మొర్తజా (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టొయినిస్ 6; ఎక్స్‌ట్రాలు 17, మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 333.
వికెట్ల పతనం: 1–23, 2–102, 3–144, 4–175, 5–302, 6–302, 7–323, 8–333.
బౌలింగ్: స్టార్క్ 10–0–55–2, కమిన్స్ 10–1–65–0, మ్యాక్స్‌వెల్ 3–0–25–0, కూల్టర్‌నైల్ 10–0–58–2, స్టొయినిస్ 8–0–54–2, జంపా 9–0–68–1.
2: ప్రపంచకప్‌లో ఆసీస్ తరఫున వార్నర్ రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు (166) సాధించాడు. అగ్రస్థానంలో కూడా అతనే (178, అఫ్గానిస్తాన్‌పై 2015లో) ఉన్నాడు.
6: వార్నర్ కెరీర్‌లో 150కుపైగా స్కోరు చేయ డం ఇది ఆరోసారి. ఈ జాబితాలో రోహిత్ (7) మాత్రమే అతనికంటే ముందున్నాడు.
3: ఆసీస్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో గిల్‌క్రిస్ట్‌తో సమంగా వార్నర్ (16) నిలిచాడు. రికీ పాంటింగ్ (29), మార్క్‌వా (18) మాత్రమే ముందున్నారు.
3: ఆస్ట్రేలియాకు వన్డేల్లో ఇది మూడో అత్యుత్తమ స్కోరు. గతంలో ఆ జట్టు 434/4, 417/6 స్కోర్లు సాధించింది.
వార్నర్ సెంచరీ సంబరం
Comments
Please login to add a commentAdd a comment