ఆసీస్ దెబ్బకు ఇంగ్లండ్ కుదేల్!
లార్డ్స్:యాషెస్ తొలి టెస్టులో ఓటమికి ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకుంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ను ఆస్ట్రేలియా చిత్తుచిత్తుగా ఓడించింది. ఆసీస్ విసిరిన 509 పరుగుల విజయలక్ష్యంతో నాల్గో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ 103 పరుగులకే చాపచుట్టేసి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఏ ఒక్క ఆటగాడు కనీసం పరుగులు చేయకుండా పెవిలియన్ కు చేరడంతో ఆస్ట్రేలియా 405 పరుగుల భారీ విజయం సాధించింది.
తమ మొదటి ఇన్నింగ్స్ లో ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్న ఆసీస్.. రెండో ఇన్నింగ్స్ లో మరింత రెచ్చిపోయింది. ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ ను 252/2 డిక్లేర్ చేసి ఇంగ్లండ్ ముందు ఐదు వందల పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ ఆ స్కోరును చూసి ముందుగానే చతికిలబడింది. ఓపెనర్లు లైత్ (7), అలెస్టర్ కుక్ (11) ఆదిలోనే పెవిలియన్ కు చేరడంతో ఇంగ్లండ్ పతనం ప్రారంభమైంది. స్టువర్ట్ బ్రాడ్ (25) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లలో కలిపి 415 పరుగులు మాత్రమే చేసి ఆసీస్ బౌలింగ్ కు దాసోహమైంది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ జాన్సన్ ఆరు వికెట్లు, హజిల్ వుడ్ ఐదు వికెట్లు(రెండు ఇన్నింగ్స్ లలో) తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. ఈ మ్యాచ్ లో విజయంతో సిరీస్ సమం అయ్యింది. తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలిచిన సంగతి తెలిసిందే.