కెవిన్ పీటర్సన్
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభమైన యాషెస్ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. కెవిన్ పీటర్సన్ (67 బ్యాటింగ్) అర్ధసెంచరీ చేయడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు చేసింది. పీటర్సన్‌తో పాటు బ్రెస్నన్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ టాపార్డర్ కుక్ (27), కార్‌బెరీ (38), రూట్ (24) విఫలమయ్యారు. పీటర్సన్, బెల్ (27)తో కలిసి నాలుగో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొన్నాక... హారిస్ బౌలింగ్‌లో బెల్ వెనుదిరిగాడు.
అయితే రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ కెవిన్ ఆ తర్వాత మరింత జాగ్రత్తగా ఆడాడు. రెండో ఎండ్‌లో స్టోక్స్ (14), బెయిర్‌స్టో (10) వెంటవెంటనే అవుటైనా... పీటర్సన్ మాత్రం వికెట్‌ను కాపాడుకునేందుకు ప్రాధాన్యమిచ్చాడు. ఈ క్రమంలో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు బ్రెస్నన్‌తో కలిసి మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు. హారిస్, జాన్సన్ చెరో రెండు వికెట్లు తీయగా, సిడిల్, వాట్సన్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.
రికార్డు స్థాయిలో ప్రేక్షకులు
ఇప్పటికే యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా సొంతమైనా.. నాలుగో టెస్టుకు మాత్రం ప్రేక్షకులు పోటెత్తారు. తొలి రోజు ఆటను తిలకించేందుకు రికార్డు స్థాయిలో 91 వేల 092 మంది హాజరయ్యారు. తద్వారా ప్రపంచ రికార్డును సృష్టించారు. టెస్టు మ్యాచ్‌కు ఒక్క రోజు హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య ఇది. 1961లో ఆసీస్, విండీస్‌ల మధ్య ఇక్కడే జరిగిన మ్యాచ్‌కు 90,800 మంది హాజరయ్యారు.