ఆసీస్ 'చెత్త' రికార్డు!
నాటింగ్ హామ్: ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ లో ఆసీస్ పేలవమైన ఆటను కొనసాగిస్తోంది. తొలి, మూడవ టెస్టులను కోల్పోయి సిరీస్ లో వెనుకబడ్డ ఆసీస్ మునుపటి ఫామ్ ను అందుకోవడం కోసం నానా తంటాలు పడుతోంది. గత యాషెస్ ను గెలిచిన ఆసీస్.. ఈ సీజన్ లో మాత్రం ఘోరమైన ఆటతీరుతో విమర్శకుల నోళ్లకు పనిచెప్పింది. రెండో టెస్టులో ఇంగ్లండ్ ను కంగుతినిపించి దూకుడుగా కనిపించిన ఆసీస్.. ఆ తరువాత ఆకట్టుకోవడంలో విఫలమవుతూనే వస్తోంది. అటు బౌలింగ్ లోనూ.. ఇటు బ్యాటింగ్ లోనూ ఇంగ్లండ్ కు దాసోహమవుతూనే ఉంది. తాజాగా గురువారం ఆరంభమైన నాల్గో టెస్టులో ఆసీస్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 18.3 ఓవర్లలో 60 పరుగులకే చాపచుట్టేసి ఇంగ్లండ్ కు తలవంచింది.
దీంతో ఇంగ్లండ్ చేతిలో ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకు ఆలౌట్ కావడం ఐదో సారి. కాగా, మొత్తంగా ఒక ఇన్నింగ్స్ లో 60 అంతకన్నా తక్కువ పరుగులకే ఆలౌట్ కావడం ఆస్ట్రేలియాకు ఆరోసారి. దీంతో పాటు తొలి 25 బంతుల్లో ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు కోల్పోవడం 2003 తరువాత ఆసీస్ కు ఇదే తొలిసారి. ఇదిలాఉండగా 2003 నుంచి ఇప్పటివరకూ ఆసీస్ తొలి ఓవర్ లో రెండు లేదా మూడు వికెట్లను నష్టపోవడం మూడోసారి.
ఈ రోజే ఆరంభమైన నాల్గో టెస్టులో ఆసీస్ వరుస వికెట్లను కోల్పోయి మరో ఓటమి దిశగా పయనిస్తోంది. లంచ్ లోపే ఒక ఇన్నింగ్స్ ను ముగించిన జట్టుగా ఆసీస్ చరిత్రకెక్కింది. ఆసీస్ ఆటగాళ్లలో తొమ్మిది మంది సింగిల్ డిజిట్ కే పరిమితయ్యారు. మిచెల్ జాన్సన్ చేసిన 13 పరుగుల వ్యక్తిగత స్కోరే అత్యధికం. కాగా, ఆసీస్ కు ఎక్స్ ట్రాల రూపంలో 14 పరుగులు రావడం గమనార్హం.
ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. కేవలం 9.3 ఓవర్లలో ఐదు మెయిడెన్లలతో సహా 15 పరుగులు మాత్రమే ఇచ్చిన బ్రాడ్ ఎనిమిది వికెట్లను తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. తాజాగా ఎనిమిది వికెట్లతో ఆకట్టుకున్న బ్రాడ్ మూడొందల వికెట్ల క్లబ్ లో చేరాడు. జట్టు తరుపున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్ గా రికార్డు సాధించాడు. తన కెరీర్ లో 83 వ టెస్టు మ్యాచ్ ఆడుతున్నబ్రాడ్ 307 వికెట్లు తీశాడు.