యాషెస్ నెగ్గిన ఇంగ్లండ్
యాషెస్ నెగ్గిన ఇంగ్లండ్
Published Mon, Aug 26 2013 1:59 AM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM
లండన్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను వరుసగా మూడోసారి ఇంగ్లండ్ జట్టు నిలబెట్టుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ సాహసోపేతమైన నిర్ణయం ఫలితాన్నివ్వలేక పోయింది. కనీసం చివరి టెస్టునైనా గెలుచుకోవాలనే ఉద్దేశంతో 226 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉండగానే క్లార్క్ తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ల్ చేశాడు. వీలైనంత త్వరగా ఇంగ్లండ్ వికెట్లను తీద్దామనుకున్నప్పటికీ ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్ అంత సులువుగా లొంగలేదు. కెవిన్ పీటర్సన్ (55 బంతుల్లో 62; 10 ఫోర్లు) అద్భుత ఆటతీరుతో చెలరేగడంతో ఓ దశలో ఇంగ్లండ్ సంచలన విజయం వైపు పయనించింది. ఈ జోడి టి20 ఆటతీరును కనబరచడంతో పరుగుల వరద పారింది. చూడముచ్చటైన బౌండరీలతో కెవిన్ అలరించాడు. 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.
అయితే వరుస ఓవర్లలో పీటర్సన్, ట్రాట్ (87 బంతుల్లో 59; 6 ఫోర్లు) అవుట్ కావడంతో దూకుడు తగ్గింది. వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు 15 ఓవర్లలోనే 77 పరుగులు జత చేరాయి. దీంతో కెన్నింగ్టన్ ఓవల్‌లో జరిగిన చివరిదైన ఐదో టెస్టు డ్రాగా ముగిసింది. 227 పరుగుల టార్గెట్‌తో ఆట చివరి రోజు తమ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కుక్ సేన 40 ఓవర్లలో 5 వికెట్లకు 206 పరుగులు చేసింది. మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే వెలుతురు సరిగా లేదని అంపైర్లు ఆటను నిలిపివేశారు. అయితే అంతకుముందే ఒక్కసారిగా క్లార్క్ తమ ఆటగాళ్లను తీసుకుని మైదానం వీడాడు.
అంతకుముందు 247/4 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 377 పరుగులకు ఆలౌటయ్యింది. ఇయాన్ బెల్ (143 బంతుల్లో 45; 5 ఫోర్లు), ప్రియర్ (57 బంతుల్లో 47; 8 ఫోర్లు) రాణించారు. ఫాల్క్‌నర్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌ను ఆరంభంలోనే ఇంగ్లండ్ బౌలర్లు వణికించారు. వికెట్లు త్వరగా పడిపోతుండడంతో 23 ఓవర్లలో 6 వికెట్లకు 111 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. క్లార్క్ (28 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అప్పటికి ఆసీస్ 226 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్టువర్ట్ బ్రాడ్ నాలుగు వికెట్లు తీశాడు.
Advertisement