ఆసీస్ కు ఇంగ్లండ్ షాక్
కార్డిఫ్: యాషెస్ సిరీస్ లో భాగంగా ఆసీస్ తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. 412 పరుగుల విజయ లక్ష్యంతో నాల్గో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ బ్యాటింగ్ ను ఇంగ్లండ్ బౌలర్లు కకావికలం చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు సమిష్టిగా రాణించి ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ను 242 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో ఇంగ్లండ్ కు 169 పరుగుల భారీ విజయం చేకూరింది. ఆసీస్ ఆటగాళ్లలో ఆల్ రౌండర్ మిచెల్ జాన్సన్(77), డేవిడ్ వార్నర్(52), స్టీవ్ స్మిత్(33) మినహా ఎవరూ ఆకట్టుకోలేక పోవడంతో ఆసీస్ కు ఓటమి తప్పలేదు. మిగతా ఆటగాళ్లలో రోజర్స్(10), మైకేల్ క్లార్క్ (4), వోజస్ (1) , వాట్సన్(19), మిచెల్ స్టార్క్(17), హజిల్ వుడ్(14) లు విఫలం చెందడంతో ఇంకా రోజు ఆట మిగిలి ఉండగానే ఆసీస్ భారీ ఓటమిని చవిచూసింది.
గత యాషెస్ సిరీస్ లో 0-5 తేడాతో ఓడిన ఇంగ్లండ్.. ఈసారి మాత్రం తొలి టెస్టులోనే ఇరగదీసింది. అటు బ్యాటింగ్ లో సత్తా చూపిన ఇంగ్లండ్ .. ఆపై బౌలింగ్ లో కూడా ఆకట్టుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, మొయిన్ అలీ తలో మూడు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించగా, మార్క్ వుడ్, రూట్ లు చెరో రెండు వికెట్లు తీసి విజయంలో తమ వంతు పాత్ర సమర్ధవంతంగా నిర్వర్తించారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యం సంపాదించింది.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ -430 ఆలౌట్ (102.1 ఓవర్లు), రెండో ఇన్నింగ్స్- 289 ఆలౌట్(70.1 ఓవర్లు)
ఆసీస్ తొలి ఇన్నింగ్స్-308 ఆలౌట్ (84.5ఓవర్లు), రెండో ఇన్నింగ్స్ 242 ఆలౌట్(70.3 ఓవర్లు)