ఆసీస్ 'చెత్తగా' చిత్తు!
హోబార్ట్:ఆస్ట్రేలియాకు స్వదేశంలో ఘోర పరాభవం ఎదురైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడింది. సఫారీల బౌలింగ్ దెబ్బకు ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ లో 161 పరుగులకే చాపచుట్టేసి ఇన్నింగ్స్ 80 పరుగుల పరాజయాన్ని చవిచూసింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్(45), ఉస్మాన్ ఖవాజా(64) మినహా మిగిలిన ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆ ఇద్దరి తరువాత కెప్టెన్ స్టీవ్ స్మిత్(31) ఒక్కేడే రెండంకెల మార్కును చేరడం గమనార్హం.
దక్షిణాఫ్రికా పేసర్ అబాట్ ఆరు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా, మరోవైపు రబడా చక్కటి సహకారం అందించాడు. ఈ ఇన్నింగ్స్ లో రబడా నాలుగు వికెట్లు సాధించాడు.ఈ మ్యాచ్లో ఓటమి పాలైన ఆసీస్ మూడు టెస్టుల సిరీస్ ను ఇంకా మ్యాచ్ ఉండగానే కోల్పోయింది. మరోవైపు ఆసీస్ మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇది ఆసీస్ కు వరుసగా ఐదో టెస్టు ఓటమి. అంతకుముందు ఆగస్టులో శ్రీలంకతో ఆసీస్ వరుసగా మూడు టెస్టులు ఓడింది.
మూడు సంవత్సరాల క్రితం భారత్ పై వరుసగా నాలుగు టెస్టులు ఓడిపోయిన ఆసీస్.. ఆ తరువాత ఆ చెత్త రికార్డును సవరించడం ఇదే తొలిసారి. నవంబర్ 24వ తేదీన అడిలైడ్లో ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది.ఈ మ్యాచ్ ను పింక్ బాల్ తో డే అండ్ నైట్ మ్యాచ్గా నిర్వహించనున్నారు.
రెండో టెస్టు మ్యాచ్..
ఆస్టేలియా తొలి ఇన్నింగ్స్ 85 ఆలౌట్,రెండో ఇన్నింగ్స్ 161 ఆలౌట్
దక్షిణాఫ్రికా 326 ఆలౌట్