ఏబీ డివిలియర్స్
పోర్ట్ ఎలిజబెత్: ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మెన్ అర్ధసెంచరీలు సాధించడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ముందంజ వేసింది. మ్యాచ్ రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. ఫలితంగా ఆ జట్టు 20 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఏబీ డివిలియర్స్ (81 బంతుల్లో 74 బ్యాటింగ్; 14 ఫోర్లు) తనదైన శైలిలో ధాటిని ప్రదర్శించగా... డీన్ ఎల్గర్ (57), హషీం ఆమ్లా (56) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ప్రస్తుతం డివిలియర్స్‌తో పాటు ఫిలాండర్ (14 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. ఓవర్‌నైట్ స్కోరు 39/1తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా కొద్ది సేపటికే నైట్‌వాచ్‌మన్ రబడ (29) వికెట్ కోల్పోయింది. ఈ దశలో ఎల్గర్, ఆమ్లా పట్టుదలగా ఆడారు. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 46.3 ఓవర్ల పాటు ఆడారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 88 పరుగులు జోడించిన అనంతరం ఆస్ట్రేలియా బౌలర్లు రివర్స్ స్వింగ్‌తో దెబ్బ కొట్టారు. ఒకే స్కోరు వద్ద ఆమ్లా, ఎల్గర్‌లను ఔట్ చేసిన ఆసీస్... వెంటవెంటనే డు ప్లెసిస్ (9), బ్రుయిన్ (1), డి కాక్ (9)లను పెవిలియన్ పంపించి పట్టు బిగించే ప్రయత్నం చేసింది. అయితే ఎదురుదాడికి దిగిన డివిలియర్స్ బౌండరీలతో విరుచుకు పడి తమ జట్టుకు ఆధిక్యం అందించాడు.
రబడపై నిషేధం!
తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను కట్టడి చేసిన దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ సిరీస్‌కు దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. మ్యాచ్ తొలి రోజు స్మిత్‌ను అవుట్ చేసిన సమయంలో సంబరంగా ముందుకు దూసుకొచ్చిన రబడ అతని భుజాన్ని బలంగా ఢీకొట్టాడు. దీనిపై ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గాఫ్‌నీ, కుమార ధర్మసేన రిఫరీకి ఫిర్యాదు చేశారు. ప్రత్యర్థి ఆటగాడిని తాకినందుకు రబడపై లెవల్ 2 ఆరోపణ నమోదైంది. ఇది రుజువైతే రబడకు 3 డీమెరిట్ పాయింట్ల శిక్ష పడుతుంది. గత ఏడాది ఫిబ్రవరినుంచి వేర్వేరు సందర్భాల్లో డిక్‌వెలా, స్టోక్స్, ధావన్‌లతో గొడవపడిన రబడ ఖాతాలో ఇప్పటికే 5 డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి. గతంలోనే 4 డీమెరిట్ పాయింట్లకు చేరినప్పుడు రబడ ఒక టెస్టు నిషేధం ఎదుర్కొన్నాడు. ఒకసారి శిక్ష ఎదుర్కొన్న తర్వాత కూడా డీమెరిట్ పాయింట్లు 24 నెలల పాటు ఆటగాడి ఖాతాలోనే ఉంటాయి. ఇప్పుడు పోర్ట్ ఎలిజబెత్ టెస్టులో రబడ తప్పు చేసినట్లు తేలితే మొత్తం పాయింట్లు 8కి చేరుకొని నిబంధనల ప్రకారం రెండు టెస్టుల నిషేధం పడుతుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మరో రెండు టెస్టులు జరగాల్సి ఉన్న నేపథ్యంలో అతను శిక్షకు గురైతే సఫారీ టీమ్ తీవ్రంగా నష్టపోక తప్పదు. ఈ నేపథ్యంలో స్మిత్‌ను కావాలని ఢీకొట్టలేదని, అది పొరపాటున జరిగిన ఘటన మాత్రమే అని చెబుతూ దక్షిణాఫ్రికా మేనేజ్‌మెంట్ రబడపై ఫిర్యాదును సవాల్ చేయాలని నిర్ణయించింది. దీనిపై రబడను ఆదివారం రిఫరీ విచారిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment