
లంకకు చుక్కలు చూపించిన ఆసీస్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక స్వల్ప స్కోరుకు చాపచుట్టేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్ లో 34.2 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటయింది. ఓ దశలో ఆసీస్ పేసర్ల దాటికి 67 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న లంక లంచ్ సమయానికి 28 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. అయితే లంచ్ అనంతరం స్పిన్నర్ లియోన్ విజృంభించడంతో లంక్ స్వల్ప స్కోరుకే చాపచుట్టేసింది. లంక చివరి 5 వికెట్లను 30 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో హెజిల్వుడ్, లియాన్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, స్టార్క్, కీఫె చెరో రెండు వికెట్లు తీశారు.
లంక తొలి ఇన్నింగ్స్:
కరుణరత్నే(5) పరుగులు చేసి ఇన్నింగ్స్ 5వ ఓవర్లో స్టార్క్ బౌలింగ్ లో వికెట్లు ముందు దొరికిపోయి తొలి వికెట్ గా వెనుదిరిగాడు. అక్కడి నుంచి లంక వికెట్ల పతనం కొనసాగింది. ఆ మరుసటి ఓవర్లో హెజిల్వుడ్ బౌలింగ్ లో ఎదురుదాడికి దిగే యత్నంలో మెండిస్(8) ఔటయ్యాడు. కెప్టెన్ ఎంజిలో మాథ్యూస్(15), చండిమాల్(15) కూడా త్వరగానే పెవిలియన్ బాట పట్టారు. పేసర్ హెజిల్వుడ్ లంక టాపార్డర్ పతనాన్ని శాసించాడు.
లంచ్ తర్వాత లియాన్ మాయాజాలం
ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్.. లంచ్ తర్వాత బ్యాటింగ్ కు దిగిన లంక మిడిల్, లోయర్ ఆర్డర్ పనిపట్టాడు. లంచ్ తర్వాతి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. 29వ ఓవర్ రెండో బంతికి డిసిల్వా(24), నాలుగో బంతికి దిల్రువన్ పెరీరా(0 )ను పెవిలియన్ బాట పట్టించాడు. తన తర్వాత ఓవర్లో కుశాల్ పెరీరా(20)ను బౌల్డ్ చేసి లంక కష్టాలను మరింత పెంచాడు. ప్రదీప్(0) ను కెఫె ఔట్ చేయడంతో 117 పరుగుల వద్ద లంక తొలి ఇన్నింగ్స్ ముగిసింది.