
స్టార్క్ మాయాజాలం.. ఆసీస్ టార్గెట్ 268
ఆస్ట్రేలియాతో జరగుతున్న తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య శ్రీలంక 353 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి ఆసీస్ ముందు 268 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అంతకుముందు లంక తొలి ఇన్నింగ్స్ లో 117 పరుగులు చేయగా, ఆసీస్ తమ తొలిఇన్నింగ్స్ లో 203 పరుగులకు ఆలౌటైంది. 282/6తో నాలుగోరోజు బ్యాటింగ్ కు దిగిన లంకను స్టార్క్ మరోసారి దెబ్బతీశాడు. తొలి సెంచరీతోనే అతిపిన్న వయసులో ఈ ఫీట్ నమోదుచేసి రికార్డు సృష్టించిన కుశాల్ మెండిస్ (254 బంతుల్లో 176 పరుగులు; 21 ఫోర్లు, 1 సిక్స్)ను త్వరగానే పెవిలియన్ బాట పట్టించాడు.
ఓవర్ నైట్ స్కోరుకు మరో 7 పరుగులు జోడించి 290 పరుగుల వద్ద ఏడో వికెట్ గా వెనుదిరిగాడు. చివర్లో హెరాత్(34 బంతుల్లో 35 పరుగులు; 6 ఫోర్లు ) రాణించడంతో లంక 350 మార్క్ చేరుకుంది. హెరాత్ ను హెజెల్వుడ్ ఔట్ చేయడంతో లంక్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇతర బౌలర్లలో హెజెల్వుడ్, నాథన్ లియోన్ చెరో రెండు వికెట్లు తీశారు.