ఊరిస్తున్న ధర్మశాల..!
ధర్మశాల: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టులో భారత్ ను విజయం ఊరిస్తోంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో వరుసగా వికెట్లను తీసిన టీమిండియా పైచేయి సాధించింది. సోమవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ ను భారత్ బౌలర్లు చావు దెబ్బ కొట్టారు. 106 పరుగులకే ఆరు వికెట్లు తీసి కష్టాల్లోకి నెట్టారు. ఈ మ్యాచ్ లో అద్భుతం జరిగితే తప్ప భారత్ విజయాన్ని ఆసీస్ అడ్డుకోవడం దాదాపు కష్టమే. ప్రస్తుతం ఆసీస్ 72 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. ఇంకా నాలుగు వికెట్లు మాత్రమే ఉండటంతో ఆసీస్ భారీ స్కోరు చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ రోజు ఆసీస్ ఆటలో ఓపెనర్లు రెన్ షా(8),డేవిడ్ వార్నర్(6)లు ఆదిలోనే నిరాశపరిస్తే, కెప్టెన్ స్టీవ్ స్మిత్(17), హ్యాండ్ స్కాంబ్(18), షాన్ మార్ష్(1) లు కూడా తొందరగానే పెవిలియన్ చేరారు. దాంతో 97 పరుగులకే ఆసీస్ ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. కాగా, మ్యాక్స్ వెల్(45) రాణించడంతో ఆసీస్ కాస్త తేరుకుంది.అయితే జట్టు స్కోరు 106 పరుగుల వద్ద మ్యాక్స్ వెల్ ఆరో వికెట్ గా పెవిలియన్ చేరాడు. అశ్విన్ బౌలింగ్ లో ఎల్బీగా మ్యాక్స్ వెల్ అవుటయ్యాడు.ఆసీస్ కోల్పోయిన ఆరు వికెట్లలో ఉమేశ్ యాదవ్, అశ్విన్ లు తలో రెండు వికెట్లు సాధించగా, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజాలకు చెరో వికెట్ దక్కింది.అంతకుముందు భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ ను 332 పరుగుల వద్ద ముగించిన సంగతి తెలిసిందే. దాంతో భారత్ కు 32 పరుగుల ఆధిక్యం లభించింది.
248/6 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు ఆదిలో నిలకడగా ఆడింది. ఓవర్ నైట్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా (63;95 బంతుల్లో 4ఫోర్లు,4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా, వృద్ధిమాన్ సాహా(31;102 బంతుల్లో 2ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొన్న జడేజా-సాహాలు జోడి స్కోరు బోర్డును నెమ్మదిగా కదిలించింది. ఈ క్రమంలోనే జడేజా 83 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ద శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ జోడి 96 విలువైన భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత జడేజా అవుటయ్యాడు.ఆసీస్ పేసర్ కమిన్స్ వేసిన బంతని లోపలికి ఆడిన జడేజా బౌల్డ్ అయ్యాడు. ఆపై భువనేశ్వర్ కుమార్, సాహా, కల్దీప్ యాదవ్లు కొద్ది వ్యవధిలోనే పెవిలియన్ చేరడంతో భారత్ కు స్పల్ప ఆధిక్యం మాత్రమే లభించింది.