
తొలి టెస్ట్ ఆసీస్‌దే
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించింది. ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 281 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 288/3తో నాలుగో రోజు ఆటను మొదలు పెట్టిన ఆస్ట్రేలియా.. మార్ష్(44) వికెట్‌ను చేజార్చుకున్న వెంటనే 290 పరుగుల దగ్గర రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 191 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని ఆస్ట్రేలియా 482 పరుగుల భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచింది.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. డివిలియర్స్(48), ఆమ్లా (35), ఫిలాండర్ (26 నాటౌట్) ప్రతిఘటించినా.. మిచెల్ జాన్సన్ (5/59), హ్యారిస్ (2/35), సిడిల్ (2/55) దెబ్బకు దక్షిణాఫ్రికా 200 పరుగులకు ఆలౌటైంది. ఈ ఓటమితో సఫారీ జట్టు టెస్ట్ సిరీస్‌లో 0-1తో వెనకబడిపోయింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ఈ నెల 20 నుంచి 24 వరకు పోర్ట్ ఎలిజబెత్‌లో జరగనుంది.
మిచెల్ జాన్సన్ కెరీర్ బెస్ట్...
తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను హడలెత్తించిన మిచెల్ జాన్సన్(7/68).. రెండో ఇన్నింగ్స్‌లోనూ చెలరేగిపోయాడు. తొలుత ఓపెనర్లు పీటర్సన్ (1), స్మిత్ (4)లను వెనక్కి పంపిన జాన్సన్.. ఆ తర్వాత డివిలియర్స్, డుమిని(10), మెక్‌లారెన్ (6)లను అవుట్ చేశాడు. మొత్తానికి రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 12 వికెట్లు పడగొట్టి కెరీర్ బెస్ట్ రికార్డు చేశాడు. ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన మిచెల్ జాన్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.