పాప(౦)...మాడిపోయింది! | Australian Open 2014: Maria Sharapova calls for clarity over heat after beating Karin Knapp 10-8 in third set | Sakshi
Sakshi News home page

పాప(౦)...మాడిపోయింది!

Published Fri, Jan 17 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM

పాప(౦)...మాడిపోయింది!

పాప(౦)...మాడిపోయింది!

ఓ వైపు మండిపోతున్న ఎండ... ఏకంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత... మరోవైపు ప్రత్యర్థి నుంచి పోరాటం... ఏకంగా మూడు గంటల 28 నిమిషాల పాటు మ్యాచ్... ఇందులో ఒక్క ఆఖరి సెట్ రెండు గంటల పాటు జరిగితే... ఎంతటి  ఫిట్‌నెస్ ఉన్న ఆటగాళ్లకైనా సాధ్యమా..? పాపం... రష్యన్ బ్యూటీ షరపోవా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్ మ్యాచ్ ఆడి గెలిచింది. ఎండ కారణంగా మిగిలిన మ్యాచ్‌లన్నీ ఆపేసినా... షరపోవా మ్యాచ్ మాత్రం సెట్ మధ్యలో ఉన్న కారణంగా ఆపలేదు. అంటే ఎండలో ఆట సాధ్యంకాని పరిస్థితుల్లోనూ సుమారు గంటసేపు షరపోవా ఆడింది.
 
 గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో మూడోసీడ్ షరపోవా 6-3, 4-6, 10-8తో కరిన్ క్నాప్ (ఇటలీ)పై విజయం సాధించి మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. మూడు గంటలా 28 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో షరపోవా 20 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో కేవలం ఏడింటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. తొలిసెట్‌లో డబుల్ ఫాల్ట్ చేసినా కీలక సమయంలో బేస్‌లైన్ ఆటతీరుతో పాయింట్లు గెలిచి సెట్‌ను దక్కించుకుంది. అయితే రెండోసెట్‌లో క్నాప్.. ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో చెలరేగింది. స్కోరును 2-2తో సమం చేసి... ఆ తర్వాత మూడు సెట్ పాయింట్లను కాచుకుని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణయాత్మక మూడోసెట్‌కు ముందు 10 నిమిషాలు బ్రేక్ తీసుకున్న షరపోవా క్రాస్‌కోర్టు విన్నర్‌తో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
 
 అయితే సర్వీస్‌ను చేజార్చుకోవడంతో క్నాప్ చెలరేగింది. వరుసగా పాయింట్లు కొడుతూ 3-3తో స్కోరును సమం చేసింది. చివరకు ఓ బ్రేక్ పాయింట్‌ను కాపాడుకున్న షరపోవా తర్వాత సర్వీస్‌ను నిలబెట్టుకుంది. మరో మూడు మ్యాచ్ పాయింట్లనూ కాచుకుని ఆధిక్యాన్ని కనబర్చింది. 17వ గేమ్‌లో క్నాప్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన షరపోవా  తన సర్వీస్‌ను నిలబెట్టుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
 
 నాదల్ సులువుగా...
 టాప్‌సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) అలవోకగా మూడోరౌండ్‌లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ రెండోరౌండ్‌లో నాదల్ 6-2, 6-4, 6-2తో తన్సాయ్ కొకినాకిస్ (ఆస్ట్రేలియా)పై నెగ్గాడు. రెండు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో స్పెయిన్ బుల్ ఎలాంటి ఇబ్బంది పడలేదు. బలమైన ఏస్‌లు సంధించిన అతను తన సర్వీస్‌లో 74 శాతం పాయింట్లు గెలిచాడు. 10 బ్రేక్ పాయింట్లలో ఐదింటిని సద్వినియోగం చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో 39 విన్నర్లు కొట్టిన ఈ స్పెయిన్ స్టార్ 19సార్లు అనవసర తప్పిదాలు చేశాడు. కొకినాకిస్ ఒక్క బ్రేక్ పాయింట్‌ను కూడా రాబట్టలేకపోయాడు. 24సార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.
 
 మహిళల ముఖ్య మ్యాచ్‌ల రెండో రౌండ్ ఫలితాలు
 రెండో సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్) 6-1, 6-4తో బార్బోరా స్ట్రైకోవా (చెక్)పై
 ఐదో సీడ్ రద్వాన్‌స్కా (పొలెండ్) 6-0, 7-5తో ఓల్గా గౌరోత్సవ్ (బెలారస్)పై
 ఎనిమిదవ సీడ్ జంకోవిచ్ (సెర్బియా) 6-2, 6-0తో అయూమి మోరిటా (జపాన్)పై
  పదో సీడ్ కరోలిన్ వోజ్నియాకి (డెన్మార్క్) 6-0, 1-6, 6-2తో మెక్‌హాలే (అమెరికా)పై గెలిచారు.
 
 పురుషుల ముఖ్య మ్యాచ్‌ల రెండో రౌండ్ ఫలితాలు
  నాలుగోీ సడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 6-2, 6-2, 7-5తో విన్సెంట్ మిల్లోట్ (ఫ్రాన్స్)పై
  ఆరో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-2, 6-1, 7-6 (4)తో బ్లాజ్ కవిచ్ (స్లోవేనియా)పై
  పదో సీడ్ సోంగా (ఫ్రాన్స్) 7-6 (6), 6-4, 6-4తో తోమజ్ బెలుచి (బ్రెజిల్)పై గెలిచారు.
 
 డెల్‌పొట్రోకు నిరాశ
 హోరాహోరీగా సాగిన పురుషుల రెండో రౌండ్ మ్యాచ్‌లో ఐదోసీడ్ యువాన్ మార్టిన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా)కు చుక్కెదురైంది. రాబెర్టో బటిస్టా అగుట్ (స్పెయిన్) 4-6, 6-3, 5-7, 6-4, 7-5తో డెల్‌పోట్రోపై విజయం సాధించి మూడోరౌండ్‌లోకి అడుగుపెట్టాడు.
 
  అనవసర తప్పిదాల (59)తో మూల్యం చెల్లించుకున్న డెల్‌పోట్రో 53 విన్నర్లు సాధించాడు. 17 బ్రేక్ పాయింట్లలో ఎనిమిదింటిని మాత్రమే కాచుకోగా, ప్రత్యర్థి 8 అవకాశాల్లో ఐదింటిని సద్వినియోగం చేసుకున్నాడు. అయితే 28 ఏస్‌లు సంధించిన అర్జెంటీనా ప్లేయర్ ఎక్కువసార్లు సర్వీస్‌ను కోల్పోయాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement