అదరగొట్టిన అవధ్ వారియర్స్ | awadh warriors team bags major win | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన అవధ్ వారియర్స్

Published Tue, Aug 27 2013 3:56 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM

అదరగొట్టిన అవధ్ వారియర్స్

అదరగొట్టిన అవధ్ వారియర్స్

సాక్షి, హైదరాబాద్: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో అవధ్ వారియర్స్ మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. గచ్చిబౌలి స్టేడియంలో సోమవారం జరిగిన పోరులో వారియర్స్ 3-2తో పుణే పిస్టన్స్‌ను చిత్తు చేసింది. తొలి పురుషుల సింగిల్స్‌లో కె. శ్రీకాంత్, మహిళల సింగిల్స్‌లో సింధు నెగ్గగా...పురుషుల డబుల్స్‌లో కిడో-బో జోడి నెగ్గి అవధ్‌కు 3-0తో గెలుపు ఖాయం చేశారు. పుణే చివరి రెండు మ్యాచ్‌లు గెలిచి ఆధిక్యాన్ని 3-2కు తగ్గించి రెండు పాయింట్లు సాధించింది.
 
 చెలరేగిన సింధు..: జులియన్ షెంక్‌తో హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్‌లో సింధు 21-20, 21-20తో గెలిచింది. ప్రపంచ మూడో ర్యాంకర్ షెంక్ ఆరంభంలో ఆధిక్యం ప్రదర్శించింది. తొలి పాయింట్‌తో మొదలు పెట్టి ఒక దశలో 7-6తో ముందంజలో నిలిచింది. అయితే చక్కటి స్మాష్‌తో స్కోరు సమం చేసిన సింధు.. ఆ తర్వాత ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. గేమ్ చివర్లో సింధు 20-19తో ముందంజ వేసినా షెంక్ డ్రాప్ షాట్‌తో స్కోరు సమం చేసింది. అయితే క్రాస్ కోర్ట్ షాట్‌ను షెంక్ కోర్టు బయటికి కొట్టడంతో గేమ్ సింధు వశమైంది. రెండో గేమ్ కూడా ఆసక్తికరంగా సాగింది. ఇద్దరూ సుదీర్ఘ ర్యాలీలు ఆడారు. అయితే ఒక్కసారిగా చెలరేగిన షెంక్ వేగంగా దూసుకుపోయింది. 11-6, 14-7, 16-9...ఇలా భారీ అంతరంతో షెంక్ ఆధిక్యం ప్రదర్శించింది. కానీ స్వయంకృతంతో సింధుకు కోలుకునే అవకాశం ఇచ్చింది. డ్రాప్ షాట్లు విఫలం కావడంతో పాటు లైన్ కాల్స్‌ను అంచనా వేయడంలో పొరబడింది. షెంక్ 19-17తో ముందంజలో ఉన్న దశలో సింధు వరుసగా మూడు పాయింట్లు గెలిచి 20-19తో నిలిచింది. స్మాష్‌తో షెంక్ స్కోరు సమం చేసినా... సింధు చక్కటి ప్లేస్‌మెంట్‌తో పాయింట్ సాధించి మ్యాచ్ గెలిచింది.
 
 శ్రీకాంత్ సునాయాస విజయం: తొలి పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో వారియర్స్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 21-18, 21-16 స్కోరుతో పుణే ఆటగాడు సౌరభ్ వర్మను చిత్తు చేశాడు. తొలి గేమ్‌లో వర్మ కాస్త పోటీ ఇచ్చినా...రెండో గేమ్‌లో మాత్రం నిలవలేకపోయాడు. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో అవధ్ ఆటగాళ్లు మార్కిస్ కిడో-మథియాస్ బో 21-15, 21-16తో అరుణ్ విష్ణు-సనవే థామస్‌లను ఓడించారు. ఈ గెలుపుతోనే అవధ్‌కు 3-0తో విజయం ఖాయమైంది. రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో పిస్టన్స్ ప్లేయర్ టిన్ మిన్ యుగెన్ 21-12, 21-18తో గురుసాయిదత్ (అవధ్)ను చిత్తు చేసి వారియర్స్ ఆధిక్యాన్ని 3-1కి తగ్గించాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, నీల్సన్ 21-16, 21-14తో అవధ్ జోడీ కిడో-పియాబెర్నాడెట్‌పై గెలిచి ఆధిక్యాన్ని 3-2కి తగ్గించారు.
 
 ఢిల్లీ, బంగా అవుట్!
 ఆఖరి లీగ్ మ్యాచ్ మిగిలుండగానే సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. 16 పాయింట్లతో పుణే, అవధ్... 15 పాయింట్లతో హైదరాబాద్, ముంబై సెమీస్‌కు చేరాయి. హైదరాబాద్‌కు మరో మ్యాచ్ మిగిలి ఉన్నందున అగ్రస్థానం సాధించే అవకాశం ఉంది. 13 పాయింట్లతో ఢిల్లీ రేసు నుంచి వైదొలిగింది. బంగా బీట్స్ ప్రస్తుతం 9 పాయింట్లతో ఉంది. నేడు హైదరాబాద్‌పై క్లీన్‌స్వీప్ చేస్తే ఆరు పాయింట్లు వస్తాయి. అప్పుడు ముంబై, హైదరాబాద్‌లతో కలిపి పోటీలో ఉంటుంది. కానీ ప్రస్తుత ఫామ్‌లో అది అసాధ్యం. కాబట్టి బంగా కూడా సెమీస్ రేసులో లేనట్లే.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement