అజహర్ నామినేషన్ తిరస్కరణ
కోర్టుకెక్కనున్న మాజీ కెప్టెన్!
హైదరాబాద్: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్‌కు ఎన్నికలకు ముందే చుక్కెదురైంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అతను వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో అతనిపై నిషేధం తొలగించడానికి సంబంధించి ‘సంతృప్తికర వివరణ’ ఇవ్వకపోవడంతో అజహర్ నామినేషన్‌ను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి కె.రాజీవ్ రెడ్డి ప్రకటించారు. ‘తిరస్కరణకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. బీసీసీఐ తనపై నిషేధం ఎత్తివేసిందని రుజువు చేసే పత్రాలేవీ ఆయన ఇవ్వలేకపోయారు. నిషేధం తొలగిస్తున్నట్లు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు మాత్రమే ఆయన చూపించారు. కానీ నేను అదే విషయంలో బీసీసీఐ ఇచ్చిన డాక్యుమెంట్‌లు అడిగాను. అతను ప్రాతినిధ్యం వహిస్తున్న క్లబ్‌లో అజహర్ ఓటింగ్ హక్కు గురించి కూడా స్పష్టత లేకపోవడం మరో కారణం’ అని రాజీవ్ రెడ్డి చెప్పారు. ఈ నెల 17న హెచ్‌సీఏ ఎన్నికలు జరగనున్నాయి.
అజహర్ తీవ్ర అసంతృప్తి...
తన నామినేషన్‌ను తిరస్కరించడం అంటే లోధా ప్యానెల్ సిఫారసులను వ్యతిరేకిస్తున్నట్లే అని అజహర్ వ్యాఖ్యానించారు. సంక్రాంతి సెలవులు ముగిసిన వెంటనే ఈ అంశంపై కోర్టులో ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. ‘సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మాజీ టెస్టు క్రికెటర్ ఎవరైనా పదవుల కోసం పోటీ పడవచ్చు. నా దరఖాస్తును తిరస్కరించడం గురించి స్పష్టత ఇవ్వమంటూ రిటర్న్ అధికారిని ఎన్ని సార్లు కోరినా ఆయన స్పందించనే లేదు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కేబినెట్ హోదాలో సౌకర్యాలు పొందుతున్న జి.వివేకానంద్‌కు నిబంధనల ప్రకారం అసలు పోటీ పడే అర్హతే లేదు. కానీ ఆయన దరఖాస్తును సరైనదిగా తేల్చారు. భారత మాజీ కెప్టెన్‌తో ఈ రకంగా వ్యవహరించడం దుర్మార్గం. అసలు హెచ్‌సీఏలో మొత్తం ఒక వర్గం కుట్ర జరిపి ప్రజాస్వామ్యవిరుద్ధంగా ఎన్నికలు జరుపుకుంటున్నారు. నేను దీనిపై న్యాయ పోరాటం చేస్తా. ఈ పరిణామాలపై ఇప్పటికే లోధా కమిటీకి లేఖ రాశా’ అని అజహర్ వ్యాఖ్యానించారు.