గర్జించిన ఇషాంత్ | Back-in-form Ishant Sharma says he is ignored for important tours | Sakshi
Sakshi News home page

గర్జించిన ఇషాంత్

Published Sat, Feb 15 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM

గర్జించిన ఇషాంత్

గర్జించిన ఇషాంత్

 ఆరు వికెట్లతో చెలరేగిన పేసర్
 షమీకి 4 వికెట్లు
 న్యూజిలాండ్ 192 ఆలౌట్
 తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 100/2
 రెండో టెస్టు
 
 పేసర్లు ఇషాంత్, షమీ విశ్వరూపం చూపడంతో రెండో టెస్టులో న్యూజిలాండ్ కుప్పకూలింది. ఓ మోస్తరు స్కోరుకే పరిమితమై మ్యాచ్‌లో వెనుకబడింది. మరోవైపు ధావన్ దూకుడుతో భారత్ రెండో టెస్టులో తొలిరోజే పట్టు సాధించింది.
 
 వెల్లింగ్టన్: వన్డే జట్టులో చోటు దక్కలేదు... ఐపీఎల్ వేలంలో పెద్దగా ధర పెట్టని ఫ్రాంచైజీలు... అసలు జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారని తీవ్రమైన విమర్శలు... ఈ నేపథ్యంలో భారత పేసర్ ఇషాంత్ శర్మ (6/51) గర్జించాడు. ‘పచ్చిక’ వికెట్‌తో దెబ్బతీస్తామన్న ఆతిథ్య జట్టును బుల్లెట్ బంతులతో నిలువెల్లా వణికించాడు.

ఇన్నాళ్లూ ధోని తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కెరీర్‌లోనే ఉత్తమ గణాంకాలు నమోదు చేసి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. ఫలితంగా బేసిన్ రిజర్వ్ మైదానంలో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 52.5 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌటైంది.
 

 విలియమ్సన్ (100 బంతుల్లో 47; 6 ఫోర్లు), నీషమ్ (35 బంతుల్లో 33; 7 ఫోర్లు), సౌతీ (32 బంతుల్లో 32; 1 ఫోర్, 3 సిక్సర్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. షమీ 4 వికెట్లతో రాణించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లలో 2 వికెట్లకు 100 పరుగులు చేసింది. ధావన్ (87 బంతుల్లో 71 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్సర్), ఇషాంత్ (16 బంతుల్లో 3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
 
 3 ఓవర్లలో 3 వికెట్లు
 న్యూజిలాండ్‌లో వరుసగా ఏడోసారి టాస్ గెలిచిన ధోని... కివీస్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. ఆరంభంలో జహీర్, షమీ లైన్ దొరక్క ఇబ్బంది పడటంతో 8వ ఓవర్‌లోనే ఇషాంత్ బౌలింగ్‌కు దిగాడు. పిచ్‌పై ఉండే తేమను సద్వినియోగం చేసుకుంటూ తొలి నాలుగు ఓవర్లలో రూథర్‌ఫోర్డ్ (12), ఫుల్టన్ (13), లాథమ్ (0)లను అవుట్ చేసి కివీస్‌కు షాకిచ్చాడు.
 
 విలియమ్సన్‌తో జత కలిసిన మెకల్లమ్ (8) ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఇషాంత్‌ను 9 ఓవర్లపాటు కొనసాగించిన కెప్టెన్... జహీర్ స్థానంలో షమీని రెండో స్పెల్‌కు దించాడు. ఈ వ్యూహం ఫలించింది. షమీ వేసిన బంతిని పేలవ షాట్ ఆడిన మెకల్లమ్ మిడాఫ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చాడు. లంచ్‌కు ముందు ఓవర్‌లో విలియమ్సన్ అవుటైనా... నో బాల్ కావడంతో బతికి బయటపడ్డాడు. ఫలితంగా కివీస్ 51/4 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది.
 
 విలియమ్సన్ నిలకడ
 తొలి సెషన్‌లో జరిగిన నష్టాన్ని నివారించేందుకు విలియమ్సన్, అండర్సన్ (24)లు లంచ్ తర్వాత నిలకడకు ప్రాధాన్యమిచ్చారు. అయితే కొద్దిసేపటి తర్వాత భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అండర్సన్ మూడు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టి ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నం చేశాడు. కానీ 34వ ఓవర్‌లో ఇషాంత్ వేసిన బంతి ఇన్‌సైడ్ బ్యాట్, ప్యాడ్‌లకు రాసుకుంటూ నేరుగా గల్లీలో ఉన్న కోహ్లి చేతిలోకి వెళ్లింది. దీంతో వీరిద్దరి మధ్య ఐదో వికెట్‌కు నెలకొన్న 39 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
 
 తన తర్వాతి ఓవర్‌లోనే ఇషాంత్... వాట్లింగ్ (0)ను డకౌట్ చేసి ఐదో వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇదే ఓవర్‌లో విలియమ్సన్ క్యాచ్ అవుటైనా... నో బాల్ కావడంతో మరోసారి గట్టెక్కాడు. చివరకు నీషమ్‌తో కలిసి ఏడో వికెట్‌కు 47 పరుగులు జోడించి... షమీ ఓవర్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సౌతీతో కలిసి కాసేపు నిలకడగా ఆడిన నీషమ్ జట్టు స్కోరును 150 పరుగులు దాటించాక షమీ బౌలింగ్‌లోనే ధోని క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు.
 
 చెలరేగిన ధావన్
 టీ తర్వాత వచ్చి రావడంతోనే సౌతీ దూకుడుగా ఆడాడు. జడేజా బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు కొట్టి ఇషాంత్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ వెంటనే బౌల్ట్ (2)ను షమీ పెవిలియన్‌కు పంపడంతో ఓ మోస్తరు స్కోరుకే కివీస్ ఆలౌటైంది. తర్వాత ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత ఓపెనర్లలో విజయ్ (2) వెంటనే అవుటైనా... ధావన్ ఆకట్టుకున్నాడు. పుజారా (19)తో కలిసి వేగంగా పరుగులు చేశాడు.
 
 అడపాదడపా బౌండరీలు బాదిన ఓపెనర్ ధావన్.. వాగ్నేర్ వేసిన 23వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో చెలరేగిపోయాడు. అయితే ఆట మరో 20 నిమిషాల్లో ముగుస్తుందనగా పుజారా అవుటయ్యాడు. నైట్ వాచ్‌మన్ ఇషాంత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.  
 
 1 న్యూజిలాండ్‌లో రెండుసార్లు ఆరు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ ఇషాంత్.
 
 గత 30 ఏళ్లలో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు భారత పేసర్లు కలిపి పది వికెట్లు తీయడం ఇదే తొలిసారి. 1983లో కపిల్ (9/83), బల్విందర్ సంధు(1/45) ఈ ఫీట్‌ను సాధించారు.
 
 స్కోరు వివరాలు
 న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: ఫుల్టన్ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 13; రూథర్‌ఫోర్డ్ (సి) విజయ్ (బి) ఇషాంత్ 12; విలియమ్సన్ (సి) రోహిత్ (బి) షమీ 47; లాథమ్ (సి) ధోని (బి) ఇషాంత్ 0; బి.మెకల్లమ్ (సి) జడేజా (బి) షమీ 8; అండర్సన్ (సి) కోహ్లి (బి) ఇషాంత్ 24; వాట్లింగ్ (సి) రోహిత్ (బి) ఇషాంత్ 0; నీషమ్ (సి) ధోని (బి) షమీ 33; సౌతీ (సి) విజయ్ (బి) ఇషాంత్ 32; వాగ్నేర్ నాటౌట్ 5; బౌల్ట్ (సి) పుజారా (బి) షమీ 2; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: (52.5 ఓవర్లలో ఆలౌట్) 192.
 
 వికెట్ల పతనం: 1-23; 2-26; 3-26; 4-45; 5-84; 6-86; 7-133; 8-165; 9-184; 10-192
 బౌలింగ్: జహీర్ 17-3-57-0; షమీ 16.5-4-70-4; ఇషాంత్ 17-3-51-6; జడేజా 2-1-12-0
 భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ బ్యాటింగ్ 71; విజయ్ (సి) వాట్లింగ్ (బి) సౌతీ 2; పుజారా ఎల్బీడబ్ల్యు (బి) బౌల్ట్ 19; ఇషాంత్ బ్యాటింగ్ 3; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: (28 ఓవర్లలో 2 వికెట్లకు) 100.
 
 వికెట్ల పతనం: 1-2; 2-89
 బౌలింగ్: బౌల్ట్ 9-4-18-1; సౌతీ 7-0-20-1; వాగ్నేర్ 7-0-36-0; అండర్సన్ 3-0-14-0; నీషమ్ 2-0-8-0.
 
 సెషన్-1:    ఓవర్లు: 26; పరుగులు: 51; వికెట్లు: 4
 
 సెషన్-2:    ఓవర్లు: 23; పరుగులు: 115; వికెట్లు: 4
 
 సెషన్-3:    ఓవర్లు: 3.5; పరుగులు: 26; వికెట్లు: 2 (కివీస్)
               ఓవర్లు: 28; పరుగులు: 100; వికెట్లు: 2 (భారత్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement