రెండో టెస్టుపై పట్టు బిగించిన భారత్
రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో 246 పరుగుల ఆధిక్యం సాధించిన తర్వాత మరో మూడు రోజుల ఆట మిగిలి ఉండగానే ఆతిథ్య న్యూజిలాండ్ జట్టును ముప్పుతిప్పలు పెడుతోంది. రెండో ఇన్నింగ్స్లో భారీగా పరుగులు చేయాల్సిన కివీస్ జట్టు ఒక వికెట్ నష్టపోయి 24 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్లో 192 పరుగులకే చాప చుట్టేసిన న్యూజిలాండ్, తన బౌలింగ్ ప్రతాపాన్ని భారత జట్టుపై ఏమాత్రం చూపించలేకపోయింది.
శిఖర్ ధావన్ దాదాపు సెంచరీ వరకు వచ్చి రెండు పరుగుల తేడాతో చేజార్చుకోగా, యువ సంచలనం అజింక్య రహానే ఆ లాంఛనం పూర్తి చేశాడు. వన్డే తరహాలో రెచ్చిపోయి 118 పరుగులు చేశాడు. కెప్టెన్ ధోనీ 68 విలువైన పరుగులు జోడించాడు. టీమిండియా 438 పరుగులకు ఆలౌట్ అయ్యి, 246 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. న్యూజిలాండ్ జట్టును రెండో ఇన్నింగ్స్లో కూడా 200 పరుగులు చేరుకోకుండానో లేదా 245 పరుగుల లోపే ఆలౌట్ చేస్తే.. ఇన్నింగ్స్ తేడాతో భారతజట్టు విజయం సాధించగలదు. తొలి టెస్టులో దాదాపు గెలిచేవరకు వెళ్లిన టీమిండియా, అంపైరింగ్ లోపాల కారణంగా 40 పరుగుల తేడాతో విజయాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే.