ముంబై ఇండియన్స్ పై బెంగళూర్ విజయం
దుబాయ్:ఐపీఎల్-7లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ రోజు ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూర్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఆటగాళ్లు 116 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ముంబై విసిరిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూర్ ఆడుతూ పాడుతూ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఓపెనర్ మడ్డిన్ సన్ (12) పెవిలియన్ కు చేరుకున్నప్పటికీ, పార్థివ్ పటేల్ నిలకడగా ఆడుతూ ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్ హీరోలు విరాట్ కోహ్లి (0), యువరాజ్(0) వరుసగా పెవిలియన్ చేరడంతో ఓ దశలో బెంగళూర్ కాస్త తడబడింది. కాగా, పార్థీవ్(56), డివిలియర్స్ (45) పరుగులు చేయడంతో బెంగళూర్ రాయల్స్ 17.3ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఓపెనర్లు వికెట్లను త్వరగా కోల్పోయి కష్టాల్లో పడింది. మైక్ హస్సీ(16), టేర్(17) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. అనంతరం అంబటి రాయుడు చేసిన (35) పరుగులు ముంబై ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. రోహిత్ శర్మ(2),పొలార్డ్ (3) వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కో్ల్పోయి 115 పరుగులు చేసింది. గత మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.