అదరగొట్టిన బంగ్లాదేశ్
ఓపెనర్లు తమీమ్, కైస్ శతకాలు
రెండో ఇన్నింగ్స్‌లో 273/0
పాక్‌తో తొలి టెస్టు
ఖుల్నా: పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనే కాదు టెస్టుల్లోనూ రాణించగలమని బంగ్లాదేశ్ జట్టు నిరూపించింది. పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (183 బంతుల్లో 138 బ్యాటింగ్; 13 ఫోర్లు; 4 సిక్సర్లు), ఇమ్రుల్ కైస్ (185 బంతుల్లో 132 బ్యాటింగ్; 15 ఫోర్లు; 3 సిక్సర్లు) అజేయ శతకాలతో అదరగొట్టి తమ జట్టు తరఫున చరిత్ర సృష్టించారు. తొలి వికెట్‌కు అజేయంగా 273 పరుగులు జోడించారు. బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం.
296 పరుగులు వెనుకబడిన దశలో శుక్రవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి 61 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 273 పరుగులు చేసింది. ప్రస్తుతం 23 పరుగులు వెనుకబడి ఉంది. ఆటకు నేడు (శనివారం) చివరి రోజు కావడంతో మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవచ్చు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 537/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 168.4 ఓవర్లలో 628 పరుగులు చేసింది. అసద్ షఫీఖ్ (158 బంతుల్లో 83; 6 ఫోర్లు), సర్ఫరాజ్ (88 బంతుల్లో 82; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) రాణించారు. తైజుల్ ఇస్లాంకు ఆరు వికెట్లు దక్కాయి.