క్రికెటర్ భార్య అరెస్ట్
ఢాకా: తమ ఇంట్లో పని చేసిన బాలికను వేధింపులకు గురిచేయడమే కాకుండా తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ షహాదత్ హుస్సేన్ భార్య న్రిట్టో హుస్సేన్ ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా ఈ కేసుకు సంబంధించి షహాదత్ , అతని భార్య తప్పించుకుని తిరుగుతున్నారని.. ఈ క్రమంలోనే షహదాత్ భార్య పుట్టింట్లో సోదాలు చేపట్టి ఆమెను అరెస్ట్ చేసినట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. తన భార్య నిట్రోతో కలిసి హుస్సేన్ మామగారి ఇంట్లో తలదాచుకుంటున్నట్లు తమకు అందిన సమాచారం మేరకే సోదాలు చేపట్టామన్నారు. కాగా, అక్కడ షహదాత్ లేడని.. కేవలం అతని భార్య న్రిట్టో మాత్రమే ఉండటంతో ఆమెను అరెస్ట్ చేశామన్నారు.
ఇటీవలే షహాదత్ హుస్సేన్ తన భార్యతో కలిసి తమ ఇంట్లో పని చేస్తున్న బాలికను తీవ్రంగా కొట్టినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి షహాదత్ భార్యను అరెస్టు చేశారు. కాగా, షహాదత్ ను కూడా త్వరలోనే అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. బంగ్లా తరఫున షహాదత్ 38 టెస్టులు, 51 వన్డేలు ఆడాడు. అయితే షహాదత్ పై కేసు నమోదు కావడంతో అతన్ని బంగ్లా క్రికెట్ జట్టు నుంచి సస్పెండ్ చేశారు.