బంగ్లాదేశ్ సంచలనం
పాక్‌పై వన్డే సిరీస్ కైవసం
తమీమ్ ఇక్బాల్ సెంచరీ
ఢాకా: ఇకపై వన్డేల్లో బంగ్లాదేశ్‌ను ఎవరూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రపంచకప్ క్వార్టర్స్‌కు చేరిన బంగ్లా టైగర్స్... తాజాగా మూడు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే పాకిస్తాన్‌ను చిత్తు చేశారు. షేరే బంగ్లా స్టేడియంలో ఆదివారం జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో పాక్‌పై గెలిచింది. తద్వారా తొలిసారి పాక్‌పై 2-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 239 పరుగులు మాత్రమే చేసింది. ఒక దశలో 77 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన పాక్‌ను సాద్ న సీమ్ (96 బంతుల్లో 77 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్సర్) ఆదుకున్నాడు. హారిస్ సోహైల్ (44) రాణించగా... చివర్లో వహబ్ రియాజ్ (40 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు. బంగ్లా బౌలర్లంతా సమష్టిగా రాణించగా... షకీబ్‌కు రెండు వికెట్లు దక్కాయి.
బంగ్లాదేశ్ జట్టు 38.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (116 బంతుల్లో 116 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ సెంచరీ చేయగా... ముష్ఫికర్ రహీమ్ (70 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధ సెంచరీతో రాణించడమే కాకుండా మూడో వికెట్‌కు తమీమ్‌తో కలిసి 118 పరుగులు జోడించాడు. పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్, రాహత్ అలీ, సయీద్ అజ్మల్ ఒక్కో వికెట్ తీశారు. ఈ రెండు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఈనెల 22న జరుగుతుంది.