
ప్రయాగ్‌రాజ్: గత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మహాకుంభమేళా నేపధ్యంలో తగ్గుముఖం పట్టాయి. 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన దరిమిలా ఆ దేశంలో అశాంతి చెలరేగింది. ఈ నేపథ్యంలో మైనారిటీ హిందువులను లక్ష్యంగా చేసుకుని పలు దాడులు జరిగాయి. ఈ ఘటనల నేపధ్యంలో భారత్- బంగ్లాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే ప్రస్తుతం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా ఈ ఉద్రిక్తతలకు పరిష్కార మార్గంగా మారింది.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం మహాకుంభ్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు బంగ్లాదేశ్ కళాకారుల బృందానికి ఆర్థికసాయం అందించింది. గంగా వేదికపై జరిగిన 10వ ఇండియా ఇంటర్నేషనల్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన ఆరుగురు సభ్యుల నృత్య బృందం ప్రదర్శన ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) సంయుక్తంగా నిర్వహించాయి. బంగ్లాదేశ్ కొంతకాలంగా భారతదేశంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూవస్తోంది.
అంతర్జాతీయ కోల్‌కతా పుస్తక ప్రదర్శన, 30వ కోల్‌కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మొదలైనవాటిలో బంగ్లాదేశ్ భాగస్వామ్యం వహించలేదు. అంతకుముందు ఈ కార్యక్రమాలలో బంగ్లాదేశ్ పాల్గొంటూ వచ్చింది. తాజాగా కుంభమేళాలో ప్రదర్శన నిర్వహించిన బంగ్లాదేశ్ కళాకారుల బృందానికి ఢాకా విశ్వవిద్యాలయ నృత్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ రాచెల్ ప్రియాంక పెర్సిస్ నాయకత్వం వహించారు. ఫిబ్రవరి 22,23లలో మహా కుంభ్‌లో రెండు రోజుల పాటు బంగ్లాదేశ్ కళాకారుల బృందం నృత్యప్రదర్శనలు నిర్వహించింది. ఈ నృత్య బృందం త్వరలో గుజరాత్, జమ్ముకశ్మీర్, జార్ఖండ్, బీహార్, అస్సాం, మేఘాలయలలో ప్రదర్శనలు ఇవ్వనుంది. ఈ నెలాఖరులో ఢిల్లీలో బంగ్లాదేశ్ కళాకారులు ప్రదర్శన నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: Mahakumbh: మహాశివరాత్రికి చివరి పవిత్ర స్నానం.. సన్నాహాలివే..
Comments
Please login to add a commentAdd a comment