
బంగ్లాదేశ్ తొలిసారి..
డబ్లిన్: సంచలన విజయాలకు మారుపేరైన బంగ్లాదేశ్ తాజాగా మరో అద్భుత విజయాన్ని సాధించింది. బుధవారం ఇక్కడ జరిగిన వన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ ను బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసి సరికొత్త ఘనతను సొంతం చేసుకుంది. ఇలా న్యూజిలాండ్ ను విదేశీ గడ్డపై ఓడించడం బంగ్లాదేశ్ కు ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి ఓటమి పాలైంది. బంగ్లాదేశ్ ఓపెనర్లలో సౌమ్య సర్కార్ డకౌట్ గా అవుటైనప్పటికీ, మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(65) రాణించాడు. అతనికి జతగా షబ్బిర్ రెహ్మాన్(65) కూడా హాఫ్ సెంచరీ సాధించడంతో రెండో వికెట్ కు 136 పరుగుల భాగస్వామ్యం లభించింది. ఆపై ముష్పికర్ రహీమ్(45 నాటౌట్), మొహ్మదుల్లా(46)లు రాణించడంతో బంగ్లాదేశ్ 10 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది.
అంతకుముందు న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. లాథమ్(84), బ్రూమ్(63), రాస్ టేలర్(60 నాటౌట్) హాఫ్ సెంచరీలు సాధించిన జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు.