'యువ పేసర్ బరిందర్ బౌలింగ్ భేష్'
పెర్త్: ఆస్ట్రేలియా బ్యాట్స్మన్, టి-20 కెప్టెన్ జార్జి బెయిలీ.. భారత యువ పేసర్ బరిందర్ను ప్రశంసించాడు. బరిందర్ పేస్ బౌలింగ్ బాగుందని, అతనికి ఉజ్వల భవిష్యత్ ఉందని బెయిలీ అన్నాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా తరపున బరిందర్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ వేదిక పెర్త్ వాకా స్టేడియం బ్యాటింగ్కు అనుకూలించినా బరిందర్ తన తొలి వన్డే మ్యాచ్లోనే సత్తాచాటాడు. బరిందర్ మూడు వికెట్లు పడగొట్టగా, ఇతర భారత బౌలర్లు భువనేశ్వర్, ఉమేష్, జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.
ఈ మ్యాచ్లో భారత్ భారీ స్కోరు (309/3) చేసినా.. ఆస్ట్రేలియా విజయం సాధించింది. రోహిత్ శర్మ (171) అజేయ భారీ సెంచరీ వృథా కాగా, ఆసీస్ ఆటగాళ్లు స్మిత్, బెయిలీ శతకాలతో తమ జట్టును గెలిపించారు. మ్యాచ్ అనంతరం బెయిలీ.. బరిందర్ బౌలింగ్ను మెచ్చుకున్నాడు. టీమిండియా కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ.. పెర్త్ పిచ్పై 309 మంచి స్కోరు అయినా, తాము మరింత మెరుగ్గా ఆడాల్సిందని అన్నాడు.