భారత క్రికెట్ రంగంలో బుధవారం ఉరుము లేని పిడుగు పడింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు అయిదు టెస్ట్‌లు ఆడుతుండగా సిరీస్ మధ్యలోనే అగ్రశ్రేణి భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించడం అనేకమందిని ఆశ్చర్యపరిచింది. ఆస్ట్రేలియాలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని మూడో టెస్ట్‌తో పాటు అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ సైతం ముగిసింది. సంచలనం రేపిన ఈ వార్త పలు అనుమానాలు, ఊహాగానాలకు కూడా తెర తీసింది.
తాజాగా పెర్త్, బ్రిస్బేన్ మ్యాచ్‌లలో తుది జట్టులో స్థానం దక్కకపోవడంతో అశ్విన్ స్వచ్ఛందంగా ఆట నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. ‘సిరీస్‌లో ఇప్పుడు నా అవసరం లేనట్టయితే, ఆటకు గుడ్‌బై చెప్పేస్తాను’ అంటూ రిటైర్మెంట్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ఆయన తేల్చిచెప్పేశారు. ‘ఆడే సత్తా నాలో ఇంకా మిగిలే ఉంది. బహుశా, (ఐపీఎల్ లాంటి) క్లబ్–స్థాయి క్రికెట్‌లో దాన్ని చూపుతాను. భారత జట్టు తరఫున ఆడడం మాత్రం ఇదే ఆఖరి రోజు’ అన్న అశ్విన్ ప్రకటన క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేని విషయమే.
మొత్తం 106 టెస్టుల్లో 537 వికెట్లు సాధించిన అశ్విన్ అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత క్రికెటర్. 132 మ్యాచ్‌లలో 619 వికెట్లు సాధించిన నిన్నటి తరం అగ్రశ్రేణి స్పిన్నర్ అనిల్ కుంబ్లే తరువాత అలా ద్వితీయ స్థానంలో నిలిచారు అశ్విన్. బంతితోనే కాదు... బ్యాట్‌తోనూ అరడజను శతకాలు, 14 అర్ధ శతకాలతో 3,503 పరుగులు సాధించిన ఘనత ఆయనది. ఇంకా చెప్పాలంటే, గత 14 ఏళ్ళ పైచిలుకు కాలంలో స్వదేశంలో భారత జట్టు తిరుగులేని శక్తిగా ఎదగడం వెనుక ఈ తమిళ తంబి కీలక పాత్రధారి. ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆయన ఏకంగా 11వ సారి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికై, ప్రపంచ రికార్డును సమం చేశారు. బరిలో ఓర్పు, బంతి విసరడంలో నేర్పు, ప్రత్యర్థిని బోల్తా కొట్టించడంలో నైపుణ్యం ఉన్న తెలివైన ఆటగాడాయన.
అందుకే, ఆటలో ఈ అగ్రశ్రేణి ఆఫ్ స్పిన్నర్ చూపే ప్రతిభకు ప్రేక్షకులు జేజేలు పలికారు. ప్రస్తుత భారత జట్టు బౌలర్లలో ప్రత్యేకంగా నిలిచారు. ఏ క్రికెటరైనా విదేశాల్లో కాకుండా సొంతగడ్డపై ఆటకు స్వస్తి పలకాలనుకుంటారు. అది సర్వసాధారణం. ఎందుకంటే, స్వదేశంలో సొంత క్రీడాభిమానుల జయజయ ధ్వానాల మధ్య ఘనంగా వీడ్కోలు పలకవచ్చని భావిస్తారు. కానీ, అశ్విన్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. దానికి కారణాలు లేకపోలేదు.
ఆడే సత్తా ఉన్న ఏ క్రీడాకారుడైనా బరిలో ఉండాలనుకుంటాడే తప్ప, అవకాశం కోసం నిరీక్షిస్తూ బెంచ్ మీద కూర్చొనే జాబితాలో చేరాలనుకోడు. అది ఎవరికైనా బాధాకరమే. అలాంటిది... టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆరు టెస్ట్ సెంచరీలు, 500కు పైగా వికెట్లు తీసుకొన్న ఏకైక క్రికెటర్‌కు తరచూ అలాంటి అనుభవం ఎదురైతే? అది మరింత బాధ కలిగిస్తుంది. 38 ఏళ్ళ వయస్సులో, కెరీర్‌లో కాలం కరిగిపోతున్న వేళ... అశ్విన్‌కు అది అవమానమూ అనిపించింది.
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా సిరీస్‌లో మధ్యలో ఆయన హఠాత్తుగా తన రిటైర్మెంట్ ప్రకటించారనుకోవాలి. సరిగ్గా పదేళ్ళ క్రితం 2014 డిసెంబర్‌లో మరో అగ్రశ్రేణి భారత క్రికెటర్ ధోనీ సైతం ఇలాగే ఆటకు అల్విదా చెప్పారు. ఈ వాస్తవ పరిణామాలన్నీ గమనిస్తూ, క్షేత్రస్థాయి అంశాలను గమనంలోకి తీసుకున్న వారికి మాత్రం అశ్విన్ నిర్ణయం మరీ దిగ్భ్రాంతికరంగా తోచదు. అదే సమయంలో జీవితంలో, ఆటలో అత్యంత కఠినమైన ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కూడా విమర్శల జోలికి పోకుండా, పక్కా జెంటిల్మన్‌గానే వ్యవహరిస్తూ అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించడం చెప్పుకోదగ్గ విషయం.
ఆస్ట్రేలియా సిరీస్‌లోని తొలి మూడు టెస్టుల్లో అడిలైడ్‌లోని రెండో టెస్ట్‌లో మాత్రమే అశ్విన్‌కు జట్టులో స్థానం దక్కింది. ప్రతిభావంతుడైన పాతికేళ్ళ వాషింగ్టన్ సుందర్ అంతకంతకూ ముందు కొస్తూ, అశ్విన్‌ను పక్కకు జరిపి జట్టులో చోటు సంపాదించుకుంటూ పోతున్నారు. ఫలితంగా అశ్విన్ హుందాగానే పక్కకు తప్పుకున్నారు. వికెట్లు పడగొట్టడంలో పేరున్న ఈ స్పిన్నర్ నిర్ణయం ‘వ్యక్తిగతం’ అని రోహిత్ శర్మ చెప్పారు కానీ రిటైర్మెంట్ ప్రకటన అనంతరం విలేఖరుల ప్రశ్నలు వద్దని అశ్విన్ సున్నితంగానే తప్పుకోవడంతో కంటికి కనిపించని కథలున్నాయనే వాదనకు బలం చేకూరింది.
అయితే, అశ్విన్ ఆది నుంచి జట్టు సమష్టి ప్రయోజనాలకై ఆడినవారే. అనేక సందర్భాల్లో సెలెక్టర్ల బంతాటలో వైట్ బాల్ గేమ్స్‌లో స్థానం దక్కించుకోకున్నా, పట్టుదలతో ఆడుతూ తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికీ కనీసం మరో రెండేళ్ళ పాటు అంతర్జాతీయ స్థాయిలో ఆడగల సత్తా ఆయనకుంది. అయినా పక్కకు తప్పుకున్నారు. గతంలో ధోనీ ఆస్ట్రేలియాతోనే మెల్ బోర్న్ టెస్ట్‌లో హుందాగా టెస్ట్ క్రికెట్ నుంచి పక్కకు తప్పుకొని, యువకులకు దోవ ఇచ్చారు. కార ణాలేమైనా, అశ్విన్ ప్రస్తుతానికి పెదవి విప్పి పెద్దగా చెప్పకుండానే పదవీ విరమణ ప్రకటించారు.
పేరు ప్రతిష్ఠలు, డబ్బు అన్నీ కెరీర్‌లో భాగమైన ఆటగాళ్ళు వాటన్నిటినీ వదులుకొని, రిటైరవుతున్నట్టు చెప్పడం నిజానికి ఎప్పుడూ కష్టమే. అశ్విన్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. కాకుంటే, పైకి గంభీరంగా కనిపిస్తూ భావోద్వేగాల్ని ప్రదర్శించకపోవడం విశేషం. అశ్విన్ వ్యక్తిగతం మాటెలా ఉన్నా, ఆయన నిష్క్రమణతో భారత క్రికెట్ ఇప్పుడో చిత్రమైన సంధి దశలో నిలిచింది. బహుశా, ఈ ప్రతిభావంతుడి తాజా నిర్ణయంతో ఒకప్పటి ఫామ్ కోల్పోయి, తడబడుతున్న రోహిత్ శర్మ, కోహ్లీలు సైతం ఆత్మపరిశీలనలో పడాల్సి రావచ్చు. ఎంతైనా ఆర్ట్ ఆఫ్ ‘లీవింగ్’ కూడా ఆర్ట్ ఆఫ్ ‘లివింగ్’లో భాగమే కదా! వెరసి, అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం అన్వేషణతో పాటు ఆయన నిష్క్రమణకు దారి తీసిన పరిస్థితులపై చర్చ చాలాకాలం కొనసాగడం ఖాయం.
కుదుపు రేపే నిర్ణయం
Published Fri, Dec 20 2024 4:58 AM | Last Updated on Fri, Dec 20 2024 4:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment