స్వదేశానికి చేరుకున్న అశ్విన్‌.. కుటుంబ సభ్యుల ఘన స్వాగతం | Ravichandran Ashwin Returns To Chennai After Retirement In Midway Of Australia Tour, Videos Trending On Social Media | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌ అనంతరం స్వదేశానికి చేరుకున్న అశ్విన్‌.. కుటుంబ సభ్యుల ఘన స్వాగతం

Published Thu, Dec 19 2024 12:13 PM | Last Updated on Thu, Dec 19 2024 12:47 PM

Ravichandran Ashwin Returns To Chennai After Retiring Midway Through Australia Tour

టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రిటైర్మెంట్‌ అనంతరం స్వదేశానికి చేరుకున్నాడు. అశ్విన్‌ చెన్నైలోని తన స్వగృహానికి చేరుకోగానే కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బ్యాండ్‌ వాయిద్యాలతో అశ్విన్‌ ఇంటివద్ద కోలాహలం నెలకొంది. 

వాయిద్యాల నడుమ అశ్విన్‌ తన భార్య, పిల్లలతో కలిసి ఇంట్లోకి ప్రవేశించాడు. అశ్విన్‌కు మొదటిగా తన తండ్రి ఎదురుపడి అభినందించాడు. అనంతరం కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా యాష్‌ను విష్‌ చేశారు. అభిమానులు యాష్‌ను పూల మాలలతో సత్కరించారు. ఫ్యాన్స్‌ అశ్విన్‌తో ఫోటోల కోసం, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు.

కాగా, అశ్విన్‌ ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌ అనంతరం రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్‌పై అశ్విన్‌ బీజీటీ ప్రారంభానికి ముందు నుంచే క్లారిటీ కలిగి ఉన్నాడు. అశ్విన్‌ తాను రిటైర్‌ కావాలనుకుంటున్న విషయాన్ని కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో తొలి టెస్ట్‌ సందర్భంగా చెప్పాడు. 

అయితే రోహిత్‌ అప్పుడు అశ్విన్‌ను వారించి రెండో టెస్ట్‌ వరకు ఎదురుచూడాలని కోరాడు. రెండో టెస్ట్‌ అయిన పింక్‌ బాల్‌ టెస్ట్‌లో అశ్విన్‌ చివరిసారి టీమిండియా జెర్సీలో కనిపించాడు. జట్టు సమీకరణల దృష్ట్యా ఆశ్విన్‌కు మూడో టెస్ట్‌లో ఆడే అవకాశం రాలేదు. దీంతో ఇదే రిటైర్మెంట్‌కు సరైన సమయమని భావించిన యాష్‌.. బ్రిస్బేన్‌ టెస్ట్‌ అనంతరం మీడియా సమావేశంలో తన మనోగతాన్ని వెల్లడించాడు.

38 ఏళ్ల అశ్విన్‌ రిటైర్మెంట్‌ నిర్ణయం ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆస్ట్రేలియాను వీడి భారత్‌కు పయనమయ్యాడు. అశ్విన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా దేశవాలీ క్రికెట్‌, ఐపీఎల్‌లో ఆడతాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ మెగా వేలంలో అశ్విన్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది. 

అశ్విన్‌ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 765 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్‌ ఐపీఎల్‌లో వివిధ ఫ్రాంచైజీల తరఫున 180 వికెట్లు తీశాడు. అశ్విన్‌ రిటైర్మెంట్‌ అనంతరం టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో భావోద్వేగంతో కూడిన సందేశాన్ని ఇచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement