టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎవ్వరూ ఊహించని విధంగా గబ్బా టెస్ట్ (భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్ట్) అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాడు. అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటన వెనుక కారణాలు ఏమని ఆరా తీస్తే మూడు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
1. విదేశాల్లో జరిగే టెస్ట్‌ల్లో అవకాశాలు కరువు
విదేశాల్లో జరిగే టెస్ట్‌ల్లో అశ్విన్‌కు అవకాశాలు కరువయ్యాయి. ముఖ్యంగా SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో జరిగే టెస్ట్‌ల్లో అశ్విన్‌ను పట్టించుకోవడమే లేదు. ఇక్కడ అశ్విన్ తప్పేమీ లేదు. SENA దేశాల్లో పిచ్‌లు స్పిన్నర్లకు పెద్దగా సహకరించవు. అందుకే అశ్విన్ తుది జట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు. విదేశాల్లో జరిగే టెస్ట్‌ల్లో అవకాశాలు కరువు కావడమే అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం వెనుక ప్రధాన కారణం కావచ్చు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో అశ్విన్‌కు ఒకే ఒక అవకాశం వచ్చింది. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో అశ్విన్‌కు అవకాశం వచ్చినా సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. బీజీటీలో తదుపరి జరుగబోయే రెండు టెస్ట్‌ల్లో కూడా అశ్విన్ అవకాశాలు దక్కడం అనుమానమే. దీంతో గబ్బా టెస్ట్ అనంతరమే ఆటకు వీడ్కోలు పలికితే బాగుంటుందని అశ్విన్ భావించాడు.
2. హోం సిరీస్‌కు ఇంకా 10 నెలల సమయం ఉంది
టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై అయితే ఆ మ్యాచ్ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్తుంది. ఆతర్వాత టెస్ట్‌ల్లో భారత అసైన్‌మెంట్ ఇంగ్లండ్‌లోనే ఉంది. భారత్ తదుపరి హోం సిరీస్ వచ్చే ఏడాది అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో ఉంటుంది. అంటే భారత్ స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడాలంటే ఇంకా 10 నెలల సమయం ఉంది.
ఒకవేళ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించకపోయినా అవకాశాల కోసం విండీస్ సిరీస్ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఇంత సమయం ఖాళీగా ఉండటం ఇష్టం లేకే అశ్విన్ ఆకస్మికంగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించి ఉండవచ్చు. ఆస్ట్రేలియాలో రిటైర్ కావడం కంటే ఉత్తమమైనది ఏదీ ఉండదని యాష్ భావించి ఉండవచ్చు.
3. వయసు
అశ్విన్ ఆకస్మికంగా రిటైర్ కావడానికి మరో ప్రధాన కారణం వయసు. ప్రస్తుతం అశ్విన్ వయసు 38 ఏళ్లు. అశ్విన్ ఇప్పుడు రిటైర్ కాకపోయినా మహా అయితే మరో రెండేళ్లు ఆడగలడు. కేవలం స్వదేశంలో జరిగే టెస్ట్‌ల్లోనే అవకాశాలు వస్తుండటంతో అశ్విన్ మహా అయితే మరో 10-12 టెస్ట్‌లు ఆడగలడు. ఈ మధ్యలో ఫామ్ కోల్పోయి లేదా జట్టుకు భారంగా మారడం కంటే అంతా బాగున్నప్పుడే రిటైర్ కావడం మంచిదని అశ్విన్ భావించి ఉండచ్చు.
Comments
Please login to add a commentAdd a comment