ముంబై: ముస్తాక్ అలీ టి20 టోర్నీ ఫైనల్లో బరోడా, ఉత్తర ప్రదేశ్ జట్లు తలపడనున్నాయి. సూపర్ లీగ్ గ్రూప్ ‘ఎ’లో బరోడా అగ్రస్థానంలో నిలవగా... గ్రూప్ ‘బి’ నుంచి యూపీ టాప్‌లో నిలిచింది. గ్రూప్ ‘ఎ’లో బ రోడాతో పాటు కేరళ, ముంబై కూడా ఎనిమిది పాయింట్లు సాధించినా... మెరుగైన రన్‌రేట్ కారణంగా బరోడా ముందుకెళ్లింది. గ్రూప్ ‘బి’లో యూ పీ 12 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ఫైనల్ బుధవారం జరుగుతుంది.
సోమవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బరోడా ముంబైపై వికెట్ తేడాతో గెలిచింది. ముందుగా ముంబై 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 151 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 57 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఫైనల్‌కు చేరాలంటే బరోడా 19.1 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించాలి. ఈ జట్టు 19 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసి నెగ్గింది. దీపక్ హుడా (35 బంతుల్లో 53; 5 ఫోర్లు; 1 సిక్స్) దూకుడుగా ఆడాడు.
మరో మ్యాచ్‌లో యూపీ జట్టు మూడు వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 158 పరుగులు చేసింది. ఉన్ముక్త్ (35 బంతుల్లో 48; 3 ఫోర్లు; 3 సిక్సర్లు), పవన్ నేగి (23 బంతుల్లో 41; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) రాణించారు. యూపీ 19.4 ఓవర్లలో ఏడు వికెట్లకు 159 పరుగులు చేసింది. ద్వివేది (35 బంతుల్లో 49; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో కేరళ 2 వికెట్ల తేడాతో విదర్భపై, గుజరాత్ 6 వికెట్లతో జార్ఖండ్‌పై నెగ్గాయి.