
ఇన్‌కమ్ ట్యాక్స్ జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: మెరుగు జనార్దన్ స్మారక బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ జట్టు చాంపియన్‌షిప్ సాధించింది. నిజామ్ బాస్కెట్‌బాల్ సంఘం (ఎన్‌బీఏ) ఆధ్వర్యంలో నిజామ్ కాలేజి గ్రౌండ్స్‌లో మంగళవారం జరిగిన ఫైనల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ 87–74 స్కోరుతో ఏఓసీ జట్టుపై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికే ఇన్‌కమ్ ట్యాక్స్ జట్టు 54–37 స్కోరుతో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది.
అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఏఓసీ 81–72 స్కోరుతో కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్‌పై గెలుపొందగా, ఇన్‌కమ్ ట్యాక్స్ 72–66 స్కోరుతో ఆర్టిలరీ జట్టుపై నెగ్గింది. అనంతరం జరిగిన కాంస్య పతకపోరులో కస్టమ్స్ జట్టు 66–63తో ఆర్టిలరీ జట్టుపై విజయం సాధించింది. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా విచ్చేసి ఇన్‌కమ్ ట్యాక్స్ జట్టుకు ట్రోఫీని అందజేశారు. ఇందులో ఎన్‌బీఏ కార్యదర్శి మహ్మద్ యూనుస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయ్ కుమార్, గన్‌ఫౌండ్రీ, ఖైరతాబాద్ కార్పొరేటర్లు పాల్గొన్నారు.