అది పూజారా ఖిల్లా: గంగూలీ
రాజ్కోట్:ఇంగ్లండ్ తో తొలి టెస్టులో టీమిండియా ఆటగాడు చటేశ్వర పూజారా శతకం సాధించడంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి ప్రశంసలు కురిపించాడు. అయితే పూజారా వరుసగా రెండో సెంచరీ సాధించడాన్ని గంగూలీ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో శతకం సాధించిన పూజారా.. మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడంటూ కొనియాడాడు.
'ఎప్పుడూ విజయవంతం కావాలనే ఒక ఒక్క లక్ష్యంతో పూజారా ఆడతాడు. అదే అతన్ని విజయపథంలో నడిపిస్తుంది. మురళీ విజయ్ తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని సాధించాడు. దాంతో మిగతా ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గింది. పూజారాకు మూడో స్థానమే సరైనది. అది పూజారా ఖిల్లా అనడంలో కూడా సందేహం లేదు. పూజారా మ్యాచ్ లో ఉన్నాడంటే కచ్చితంగా మూడో స్థానంలోనే ఆడించాలి 'అని గంగూలీ అభిప్రాయపడ్డాడు. గతంలో బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, స్టీవ్ వాలు అనేక మ్యాచ్ ల్లో ఇదే స్థానంలో బరిలోకి దిగి సక్సెస్ అయిన సంగతిని గంగూలీ గుర్తు చేశాడు.ఇదిలా ఉండగా, స్వదేశంలో తానేంటో నిరూపించుకున్న పూజారా.. విదేశాల్లో ఇంకా పూర్తిస్థాయి ప్రదర్శన చేయలేదన్నాడు. ఆ మేరకు పూజారా కృషి చేయాలని గంగూలీ సూచించాడు.