బీసీసీఐ ఏజీఎం మార్చి 2న
చెన్నై: ఎట్టకేలకు బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగే తేది ఖరారైంది. మార్చి 2న చెన్నైలోనే ఏజీఎం జరపాలని బోర్డు అత్యవసర వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది. ఆరు వారాల్లోగా బోర్డు తమ ఏజీఎంతో పాటు ఎన్నికలు జరపాలని గత నెల 22న సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ సమావేశానికి తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడి హోదాలో ఎన్.శ్రీనివాసన్ కూడా హాజరయ్యారు. సుప్రీం కోర్టు ఇటీవల సూచించిన మార్గదర్శకాల అమలుపై కమిటీ చర్చించింది.
అలాగే ఈ విషయంలో న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించింది. ‘మార్చి 2న ఉదయం 9.30 గంటలకు చెన్నైలో ఏజీఎం జరపాలని బీసీసీఐ అత్యవసర వర్కింగ్ కమిటీ నిర్ణయించింది’ అని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. కేవలం అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో బోర్డు స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించిన కోర్టు తీర్పుపై ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. మరోవైపు మాజీ ఆటగాళ్లకు ఇచ్చే పెన్షన్‌ను 50 శాతం పెంచాలని నిర్ణయించారు. బోర్డు ఎన్నికల్లో పోటీ చేసేందుకు శ్రీనివాసన్ అనాసక్తి ప్రదర్శిస్తే మాత్రం ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడుగా ఉన్న శివలాల్ యాదవ్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. అలాగే చెన్నై జట్టును ఇండియా సిమెంట్స్ నుంచి వేరు చేసిన విషయాన్ని శ్రీని.. కమిటీకి తెలిపారు. శ్రీనివాసన్‌పై అసత్య ఆరోపణలకు దిగుతున్న బీహార్ క్రికెట్ సంఘం (సీఏబీ) కార్యదర్శి ఆదిత్య వర్మపై న్యాయపరంగా ముందుకెళ్లాలని వర్కింగ్ కమిటీ నిర్ణయించింది.