ఫిక్సింగ్‌పై విచారణకు త్రిసభ్య కమిటీ
ప్యానెల్‌లో రవిశాస్త్రి, సీబీఐ మాజీ డెరైక్టర్ రాఘవన్
బీసీసీఐ వర్కింగ్ కమిటీ నిర్ణయం
న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్‌లో వెలుగుచూసిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఉదంతాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరోసారి విచారణ కమిటీని నియమించనుంది. సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన ముద్గల్ కమిటీ నివేదికలో బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్‌తో పాటు మరో 12 మందిని నిందితులుగా పేర్కొన్న విషయం తెలిసిందే.
ఫిక్సింగ్‌పై పూర్తి పారదర్శకంగా విచారణ సాగాలంటే సభ్యులుగా ఎవరిని నియమిస్తారో తెలపాల్సిందిగా ఈనెల 16న కోర్టు బీసీసీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన వర్కింగ్ కమిటీ... ఫిక్సింగ్‌పై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో మాజీ ఆల్‌రౌండర్ రవిశాస్త్రితో పాటు కలకత్తా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ జేఎన్ పటేల్, సీబీఐ మాజీ డెరైక్టర్ ఆర్‌కే రాఘవన్ సభ్యులుగా ఉంటారని తెలిపింది. 1999-2000లో సంచలనం సృష్టించిన మ్యాచ్ ఫిక్సింగ్‌పై సీబీఐ విచారణకు రాఘవన్ నేతృత్వం వహించారు.
ఓ దశలో లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ పేరుపై కూడా చర్చ జరిగింది. సభ్యుల పేర్లను సుప్రీం కోర్టు పరిశీలనకు పంపనున్నారు. ‘ఈ త్రిసభ్య కమిటీకి ఎవరు నేతృత్వం వహించాలో కోర్టు తెలుపుతుంది. మా బాధ్యతల్లా విచారణ కమిటీకి సభ్యులను నియమించడం వరకే. దాన్ని పూర్తి చేశాం’ అని వర్కింగ్ కమిటీలో పాల్గొన్న సభ్యుడొకరు తెలిపారు. శ్రీనివాసన్‌ను విమర్శిస్తున్న శశాంక్ మనోహర్ విద ర్భ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధిగా సమావేశానికి హాజరయ్యారు.
క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా
శ్రీని స్థానంలో మరొకరు...
మరోవైపు సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం బోర్డు క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఉన్న శ్రీనివాసన్ స్థానంలో మరొకరిని నియమించనున్నారు. మే రెండో వారంలో జరిగే ప్రత్యేక సాధారణ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంటామని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) సంయుక్త కార్యదర్శి పీవీ శెట్టి తెలిపారు. మరోవైపు ఈ కమిటీలో ఉన్న రవిశాస్త్రి ఐపీఎల్, క్రికెట్ కామెంట్రీతో సంబంధం ఉన్నవాడని, అందుకే వీరు ఏమేరకు స్వేచ్ఛగా పనిచేస్తారో చూడాల్సిందని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఏసీ ముత్తయ్య అభిప్రాయపడ్డారు.
రవిశాస్త్రి ఎంపికపై అభ్యంతరం
ఫిక్సింగ్‌పై విచారణ కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో రవిశాస్త్రిని నియమించడాన్ని బీహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మ వ్యతిరేకించారు. ‘బీసీసీఐ ఏర్పాటు చేసిన ఈ ప్యానెల్‌ను 22న సుప్రీం కోర్టులో జరిగే విచారణలో వ్యతిరేకిస్తాను. సీబీఐ లేదా జాతీయ ఇం టెలిజన్స్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఆధ్వర్యంలో మాత్రమే విచారణ జరగాలి. ముగ్గురు సభ్యుల్లో ఇద్దరిపై నాకెలాంటి వ్యతిరేకత లేకపోయినా రవిశాస్త్రి చాలాకాలంగా బీసీసీఐ నుంచి వేతనం పొందుతున్న ఉద్యోగి. గత కొన్ని రోజులుగా ఆయన శ్రీని జపం చేస్తున్నారు. అందుకే ఆయనపై ఎలాంటి ఆశ లేదు’ అని వర్మ తేల్చి చెప్పారు.