‘పద్మభూషణ్’కు ధోని
న్యూఢిల్లీ: దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’ కోసం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరును బీసీసీఐ నామినేట్ చేసింది. ధోని కెప్టెన్సీలో భారత జట్టు 2007లో టి20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్‌ను సాధించింది. ‘ఈసారి పద్మ పురస్కారాల కోసం బీసీసీఐ ధోని పేరును మాత్రమే ఏకగ్రీవంగా ప్రతిపాదించింది. భారత జట్టు వన్డే అత్యుత్తమ ఆటగాళ్లలో అతను ఒకడు. వన్డేల్లో దాదాపు పది వేల పరుగులు చేయడంతోపాటు 90 టెస్టులు ఆడాడు.
ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అందుకే ఈ అవార్డుకు ధోనిని మించిన వారు కనిపించలేదు’ అని బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా తెలిపారు. గతంలో కపిల్‌దేవ్, సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, చందూ బోర్డే, దేవధర్, సీకే నాయుడు, లాలా అమర్‌నాథ్, రాజా భళీంద్ర సింగ్, విజయ ఆనంద్ ‘పద్మభూషణ్’ పురస్కారం అందుకున్నారు.