సురేశ్ రైనాకు షాక్
ముంబయి: జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన టీమిండియా బ్యాట్స్‌మన్ సురేశ్ రైనాకు బీసీసీఐ ఝలక్ ఇచ్చింది. తమిళనాడు ప్రిమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)లో అతడు ఆడకుండా మోకాలడ్డింది. రైనా, యూసుఫ్ పఠాన్, మనోజ్ తివారి, సంజూ శామ్సన్ సహా 88 మంది క్రికెటర్లు టీఎన్‌పీఎల్‌లో ఆడేందుకు ఆసక్తి కనబరిచారు. బయట రాష్ట్రాల క్రికెటర్లు కూడా టీఎన్‌పీఎల్‌లో పాల్గొనవచ్చంటూ ఇటీవల నిబంధనలు సవరించారు. దీంతో ఈ టోర్నమెంట్‌లో ఆడేందుకు వీరంతా ముందుకు వచ్చారు.
జూలై 22 నుంచి టోర్ని ప్రారంభం కానుంది. ఆ సమయంలో తనకు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులు లేనందున మ్యాచ్ ప్రాక్టీసు కోసం తాను టీపీఎల్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు రైనా వెల్లడించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయట రాష్ట్రాల క్రికెటర్లను టీపీఎల్‌లో అనుమతించే ప్రసక్తి లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు టీఎన్‌పీఎల్‌కు లేఖ రాసింది. బయట రాష్ట్రాల క్రికెటర్లను అనుమతించే విషయంపై వివరణ ఇవ్వాలని టీఎన్‌పీఎల్ నిర్వాహకులను బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి ఆదేశించారు.
తమ ఆటగాళ్లను టీఎన్‌పీఎల్‌లో ఆడనివ్వబోమని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ప్రకటించింది. టీఎన్‌పీఎల్‌లో ఆడేందుకు రాహుల్ త్రిపాఠికి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) ఇవ్వబోమని తెలిపింది. కాగా, ఇటీవలే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన రైనా ఇటువంటి చర్యలతో టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకునే అవకాశాలను క్లిష్టం చేసుకుంటున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.